పుట:Naajeevitayatrat021599mbp.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావడంతో బాటు, చేతిపనులలో నైపుణ్యమూ హెచ్చయి, సంఘానికి ఆర్థికంగా బలం చేకూర్చడానికి వీలవుతుంది. కాని ప్రజలూ, ప్రభువులూ కూడా గ్రామసీమలలోని ప్రజలు సత్తువ సంపాదించడం కన్న పెద్ద పెద్ద మిల్లు యజమానులు బలపడడమే ముఖ్యమని అనుకోవడం వల్ల ఈ స్థితి కొన్నాళ్ళకు బాగా విషమించ డానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే మిల్లు యజమానుల పరమయిన మనస్తత్వంతో ఉన్న మంత్రులకుగాని, ఆర్థిక శాస్త్రవేత్తలకుగాని - దీని ప్రమాదం 1939 లోనే తెలియనప్పుడు, కాంగ్రెసుకు నైతిక ప్రాబల్యం తగ్గిన యీ రోజులలో ఇటువంటి గ్రామీణ పునర్నిర్మాణ మహోద్యమాలకు చోటెక్కడ?

"స్వరాజ్య" పత్రిక చరితార్థత

"స్వరాజ్య" పత్రిక పుట్టు పూర్వోత్తరాలు ఈ గ్రంథ పూర్వ సంపుటాలలో ఇదివరకు ప్రకాశంగారే వ్రాశారు. మంత్రివర్గం ఏర్పాటయేసరికి స్వరాజ్య పత్రిక యంత్రాల సంబంధమైన కొన్ని ఋణాలింకా మిగిలి ఉన్నవి. మంత్రిగా ఉన్నపుడు, లావాదేవీలలో పడడం ప్రకాశంగారి కిష్టంలేదు. అసలు అంతకు ముందు, ప్రొవిన్షియల్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడుగా ఉండి, పత్రికకు వాటాలు వసూలు చేయడం మంచిది కాదని డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు చాలా అభ్యంతరం పెట్టారు. [1] అటువంటి సందర్భంలో మంత్రిగా ఉండినా, స్వరాజ్య పత్రిక కంపెనీని వాలంటరీ లిక్విడేషన్ చేసేసినట్లయితే బాగుంటుందని ఆలోచించి ఆ విధంగా చేసేశారు.

  1. డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు పార్ల మెంటరీ బోర్డులోను, ఆలిండియా వర్కింగ్ కమిటీలోనూ సభ్యత్వం కలిగి ఉండి, కేంద్ర శాసన సభకు అభ్యర్థులను నిలబెట్టే సమయంలో తాను ప్రారంభించిన "శుభోదయ" పత్రికకు అభ్యర్థుల దగ్గర పెద్ద పెద్ద మొత్తాలు వాటా ధనం క్రింద వసూలు చేయడం నాకు స్వయంగా తెలుసు. అది సరిగ్గానే ఉందని ఆయన అనుకున్నారు.