పుట:Naajeevitayatrat021599mbp.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జారీ అయి, తెలుగు ఉద్యోగస్థులు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఏదో అల్లరి బయలుదేరడానికి అవకాశా లున్నాయి.

ఖద్దరు పరిశ్రమ - గ్రామ స్వరాజ్యము

చేతి వడకునూలు, చేనేతబట్ట గ్రామ స్వరాజ్యాన్ని పటిష్ఠం చేయడానికి మొదటి మెట్లు. ఇంటింటా తిరిగి రాట్నాలు పున: ప్రతిష్ఠాపన చేసి ఖద్దరు నేయించడం అనేది రాజకీయమైన స్వాతంత్ర్య సమర చిహ్నమనే బావం ఒకటి కాంగ్రెసువారికి అందరికీ ఉండేది. అందుచేత ప్రభుత్వంవారు తమ ఖర్చుపైన ఎక్కడ బట్టలు సరఫరా చేయవలసి వచ్చినా అక్కడ ఖద్దరు ఇవ్వటం మంచిదని కాంగ్రెసువారు భావించారు. అయితే, ఇది పోలీస్ డిపార్టుమెంటువారు, మిలిటరీవారు అంగీకరించ లేదు. కాని, మిగిలిన చోట్ల ఈ గుడ్డలే కొనియివ్వవచ్చు గదా! ముఖ్యంగా ఆస్పత్రులలోను, మిగిలిన శాఖలలోను సిబ్బందికి ఖద్దరుగుడ్డ లిచ్చుటకు యత్నములు జరిగినమాట వాస్తవమే. కాని, అంత పట్టుదల మంత్రులు చూపించలేదు. చూపించి నట్లయితే మూడు నాలుగేండ్లలో అన్ని విధాలయిన కార్యాలకు ఉపయోగకరమైన, నాణ్యమైన ఖద్దరు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉండేది. బట్టల మిల్లులకు ప్రభుత్వంవా రిచ్చే సదుపాయాలు, సహాయాలు, బలము మొదలైన వాటి విషయం దేశంలో సరిగా తెలియక వాటికి అయ్యే ఖర్చు ప్రజలే వహిస్తూండడం వల్ల - మిల్లుగుడ్డ హెచ్చు ఖరీదో, ఖద్దరు హెచ్చు ఖరీదో సరిగ్గా పోల్చుకోవడం చదువుకున్న వారికి కూడా కొంత కష్టము. ఇలాంటి పరిస్థితులలో ఈ రోజుదాకా కూడా ఖద్దరు వెనుకబడి ఉంది. పల్లెటూళ్ళలో, ముఖ్యంగా నాణ్యమైన ఖద్దరు తయారుచేసే ఉద్యమం అప్పట్నుంచి సాగిఉంటే - చేతిలో ఏ పనీలేని వారికి, సరిపడినంత పనిలేని వారికీ ఖద్దరు ఆర్థికంగా ఎంతైనా ఉపకరించి ఉండేది. నేటికీ, గ్రామసీమలలో ఉద్యోగ సదుపాయాలు ఎలా చేయడమనేది ఆలోచనా స్థితిలోనే ఉంది. రాళ్ళు బద్దలు కొట్టించి, మన్ను మోయించి, కూలి యిచ్చి, నిరంతరం వారిని కూలీలుగా ఉంచి పెంచడం కన్న వడుకునూలు, చేనేతబట్ట కేంద్రాలు హెచ్చు చేస్తే, వారికి కూలీ గిట్టుబాటు