పుట:Naajeevitayatrat021599mbp.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా ప్రభుత్వం బాధ్యత వహించ వలెననీ ఉండేది. అయితే, అది ఫలించలేదు. ఇలాగే దేవాలయాల నిర్వహణ శాఖను రాజాజీయే నడిపించారు. దీనికితోడు, ఇంకా అనేక విషయాల లోనూ రాజాజీ సహాయకారి కాకపోవడం తటస్థించింది.

వజ్రపు గనుల లైసెన్సు

మంత్రివర్గం ఏర్పాటయిన కొంత కాలానికి గిరిధర దాస్ నారాయణ దాస్ అనే ఆయన చెన్నరాష్ట్రంలో వజ్రపు గనులు జరిపించే నిమిత్తమై లైసెన్సుకోసం చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొన్నాడు.

అప్పట్లో ఆయన స్టేటు కౌన్సిల్లో, అనగా ఇప్పుడు రాజ్యసభ అని పిలవబడేదానికి ప్రత్యామ్నాయంగా స్వాతంత్ర్యానికి పూర్వం ఉండే సభలో సభ్యుడు. ఆయన కుటుంబం అంతకు రెండు వందల సంవత్సరాల ముందు నుంచి చెన్నపట్నంలోనే నివసిస్తూండేది.

వజ్రపు గనులకు లైసెన్సు విషయంలో, గవర్నమెంటు భూములకు సంబంధించి నంతవరకు రెవిన్యూశాఖ భూమి త్రవ్వకాలకు అనుమతి యివ్వాలి. ఆ రోజులలో శొంఠి రామమూర్తిగారు చెన్నపట్నంలో కలెక్టరుగా ఉండేవారు. ఆయన వజ్రపు గనులు నడిపించడానికి తగిన ధన బలం విజ్ఞప్తిదారుకుందని ఆమోదిస్తూ సాల్వెన్సీ సర్టిఫికేటు ఇచ్చారు.

ఈ వినతి పత్రం ఆలోచనలో ఉన్న సమయంలో, రామకృష్ణ డాల్మియా అనే ఆయన ఆ వజ్రపు గనికి తనకు లైసెన్సు ఇవ్వాలని ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. బాబూ రాజేంద్రప్రసాద్‌గారి వద్దనుంచి సిఫారసుపత్ర మొకటి ఆయన ముఖ్యమంత్రిగారి పేర తెచ్చుకున్నాడు. ఆయన చెన్నపట్నం చేరేవేళకు ముఖ్యమంత్రిగారి పక్షాన మంత్రి రామనాథంగారు సెంట్రల్ స్టేషన్ ప్లాట్‌ఫారంమీద ఆయనకు స్వాగతమిచ్చాడు. ఆనాటి మద్రాస్ మెయిల్ పత్రికలో ఈ ఆహ్వానాన్ని సూచించే ఛాయా చిత్రాన్ని, "ఉత్తర హిందూస్థానపు పారిశ్రామిక వేత్త (డాల్మియా)కు చెన్నరాష్ట్ర ప్రభుత్వం స్వాగతం ఇస్తున్నది" అన్న