పుట:Naajeevitayatrat021599mbp.pdf/640

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అర్థంగల మాటలతో పెద్ద సైజు బొమ్మతోసహా అచ్చువేశారు. సచివాలయంలో అప్పటికే లైసెన్సు విషయమై నడుస్తున్న గ్రంథానికి మరొక ఉపగ్రంథం బయలుదేరింది. ఒకనాటి ఉదయం, అప్పట్లో "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" పత్రికకు సంపాదకుడుగా ఉన్న ఖాసా సుబ్బారావు ఒక మార్వాడీ పెద్ద మనిషిని వెంటబెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చి, డాల్మియా తాలూకు వజ్రపు గనుల లైసెన్స్ విజ్ఞప్తి విషయమై ప్రసంగించారు. ఈ రాష్ట్రంలోని భూగర్భంలో గల సంపద రాష్ట్రేతరులకు అప్ప జెప్పడం నా కిష్టం లేదనీ, రాష్ట్రంలో గలవారికి ధనశక్తి చాలక పోయినట్టయితే ఆ గనులను ప్రభుత్వం వారే త్రవ్వించడం జరుగుతుందనీ చెప్పి, నా అభిప్రాయంతో ప్రకాశంగారు ఏకీభవించినట్టు చెప్పాను. నాతో లాభం లేదనుకొని, ఆ పెద్ద మనిషి సుబ్బారావును ప్రకాశం గారింటికి తీసుకు వెళ్ళాడు.

డాల్మియా విజ్ఞప్తి విషయం మాటవరుసకు ప్రసంగ ధోరణిలో చెప్పినట్టు చెప్పి, అయినా అది తన కదెందు కన్నట్లు ఆ ప్రసంగం మాని, ఆ మార్వాడీ పెద్ద మనిషి - ప్రకాశంగారితో, "మీకు నిడుంగాడి బ్యాంకివారు, స్వరాజ్య ప్రెస్సుకు సంబంధించిన ఏడెనిమిదివేల రూపాయల మొత్తం చెల్లించవలసిందని నోటీసు ఇచ్చినట్టు తెలిసింది. లోగడ, మీరు స్వాతంత్ర్య సమరంలో చేసిన త్యాగం చూసి మావంటి వారికి మీ పైన గురుభావము, భక్తి. మీకు తెలిసినా, తెలియక పోయినా మే మెప్పుడూ మిమ్మల్ని మా మనసులలో పూజిస్తుంటాము. మీరు మంత్రిగా ఉన్న ఇటువంటి సమయంలో ఆ బ్యాంకివారు నోటీసిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు," అని అంటూ తన చొక్కా జేబులోంచి కరెన్సీ నోట్ల కట్ట ఒకటితీసి, " ఈ పదివేల రూపాయలు నేను మీకు బ్యాంకి బాధ వదలగొట్టడానికి, పాద కట్నంగా ఇస్తున్నాను స్వీకరించవలసింది," అనేసరికి, భాసా సుబ్బారావుకు మతిపోయినట్లయింది. ప్రకాశంగారు అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయరు గదా! ఇదివరలో ఎన్నడూ సాయం చేయని ఆయన ఈ రోజున ఇంత సద్బుద్ధితో రావడంలో కల్మషం ఉండక తీరదని క్షణంలో గ్రహించి,