పుట:Naajeevitayatrat021599mbp.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళిన పిదప వారి వ్యాఖ్యకూడా పొందుపర్చాలి. వాటిపైన న్యాయ శాఖ, సచివాలయం వారు తమ వ్యాఖ్యానం ఖండ ఖండానికి ప్రత్యేకంగా వ్రాయాలి. ఇటువంటి వ్యాఖ్యానాలు అయిన పిదప మంత్రిమండలిలో గల మంత్రులలో జూనియర్ అయిన మంత్రి మొదట తన వ్యాఖ్య వ్రాయాలి.

అలాగు ఉత్తరోత్తరా సీనియారిటిని బట్టి మంత్రులు తమ వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. ఆ పిమ్మట ముఖ్యమంత్రిగారికి ఫైలు చేరుతుంది. వారి వ్యాఖ్యలు వ్రాసిన పిమ్మట సంపూర్ణమైన ఆ వ్యాఖ్యాన గ్రంథమంతా బిల్లుకు సంబంధించిన మంత్రిగారికి వస్తుంది. వ్యాఖ్యలు అనగానే ప్రతి ఖండంపైన ప్రతి వ్యక్తీ ఏదో వ్రాస్తారని భావించనక్కరలేదు. అలాగున వ్రాయరు. తమకు ముఖ్యమనిపించిన అంశం ఏదైనా ఉంటే - చేర్పో, మార్పో వ్రాస్తారు. లేకపోతే, పొడి అక్షరాలతో అంగీకార సూచకంగా సంతకం చేస్తారు. ప్రకాశంగారి నివేదికలో మూడు బిల్లులున్నవి. అందుచేత ఈ వ్యాఖ్యాన క్రమం మరీ ఆలస్యమైంది. మంత్రిమండలిలో ఒకరిద్దరు జూనియరు మంత్రుల చేతులలోనే ఫైలు నడవక వారి ఆఫీసు బల్లలపైనే యోగ నిద్రలో ఉండేది.

గిరిగారు మినహాయిస్తే, తక్కినవారు వ్యతిరేక వ్యాఖ్యలే వ్రాసినట్లు నాకు జ్ఞాపకము. ఈ సంబంధమైన రికార్డులు, పాత జి. ఓ. లు మన ఆంధ్ర ప్రభుత్వానికి నేటిదాకా అందకపోవడం చేత ఈ విషయం ఇంతకన్న వివరంగా వ్రాసే వీలులేకపోయింది.

చివరకు 1939 సెప్టంబరులో యుద్ధ ప్రకటనకు విరుద్ధంగా మంత్రివర్గం రాజీనామా చేసే నాటిదాకా, ముఖ్యమంత్రిగారి వ్యాఖ్యతో ఆ ఫైలు ప్రకాశంగారికి చేరలేదు. ప్రకాశంగారికి ఈ ఆలస్యంతో శాసన సభలో తనను బలపరచిన నాడు ముఖ్యమంత్రిపై కలిగిన కృతజ్ఞతా సంతోషములు సంపూర్ణంగా నాశనం కావడమేగాక, ముఖ్యమంత్రితో యధాలాపముగా ఇష్టాగోష్ఠి ఎవరు చేసినా వారందరూ ఆలస్యానికి కారకులే నన్న చికాకు కలిగింది. అయితే ప్రకాశంగారు సహ