పుట:Naajeevitayatrat021599mbp.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిపోయింది. ప్రేక్షకులు కూర్చునేందుకున్న స్థలం పరిమితమైంది. ఇదంతా చూచి, సాంబమూర్తిగారు కొన్ని లౌడ్‌స్పీకర్లు తెప్పించి ఆవరణలో ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటరీ కార్యక్రమానికి చాల వింత అయిన విధానము. ప్రేక్షకులు లోపలకు రావడానికిగాని పాసులు కావాలనే నిబంధన లున్నాయికాని, బయట ఉండి వినడానికిగాని, అలా వినేటందుకు ఏర్పాటు చేయడానికిగాని వ్యతిరేకమైన నిబంధన లేమీ కనిపించలేదు. ఇంతేకాక, సాంబమూర్తి గారు ప్రజల కీ మాత్రం సౌకర్యం కలుగజేస్తుండగా ఎవరైనా అడ్డువస్తే ప్రజలంతా ఊరుకుంటారా? ఇంతేకాక, అట్టే అవకాశాలు లేని రెవిన్యూ శాఖకు మంత్రియై ప్రకాశంగారు ఒక విప్లవాత్మకమైన నినాదంగల నివేదిక ప్రజల పరంగా శాసన సభకు అందజేసే సమయంలో వారు చెప్పే మాటలు వినడానికి కయినా వీలులేకుండా చేస్తే, ఇదేం శాసన సభ అని ప్రజలు వచ్చి మీద పడిపోతారేమో అన్నంతగా వాతావరణం ఉండడంవల్ల ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు తమ మనసుల్లోనే అణచుకుని, మాట్లాడక ఊరుకున్నారు.

ప్రకాశంగారు చర్చ ఆరంభించడానికి లేచి నిలబడేసరికి శాసన సభలో గట్టిగా, నిర్విరామంగా చప్పట్లు ఆరంభమయ్యాయి. స్పీకరు గారు చప్పట్లు కొట్టడం కూడదని చెప్పారు. దాంతో సభ నిశ్శబ్దమయింది. ప్రకాశంగారు మాట్లాడడం ఆరంభించినప్పు డెప్పుడూ చుంద్రమైన కంఠంతో మాటకు, మాటకు మధ్య కొంచెం ఎక్కువ విరామంతో మాట్లాడడం అలవాటు. అది ఉపన్యాస ప్రారంభదశ అన్నమాట. ఆయన రోజుకు వెయ్యి రూపాయల చొప్పున దినవారీ ఫీజు పుచ్చుకుని హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో కూడా ఆయన వాగ్వైఖరి అదే. రానురాను ఉపన్యాసం వేగం అందుకొనేది. ఆ రోజున ఆయన ఉపన్యాసం ఇలా ప్రారంభించారు:

"అధ్యక్షా! ఈ విధాన సభవారు నియమించిన ఉపసంఘం పక్షాన రెండు నెలల క్రిందట నేను ఆ సంఘం నివేదికను మీకు