పుట:Naajeevitayatrat021599mbp.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవేశం తెచ్చుకొన్నారు. వారు తర్వాత ముఖ్యమంత్రిగారిని కలుసుకొని ఏమైనా, ఈ ప్రార్దనను శాసన సభలో ఆపివేయాలని ఆయనను ఎలాగో మెత్తబరిచారు. ఒక రోజున ఆయన ముందుగా సాంబమూర్తిగారి గదిలోకి పోయి, ఆయనకు నచ్చజెప్పి _ శాసన సభలో లేచి, ప్రార్థన చేయడ మన్నది సర్వమత సమ్మతమయిన దయినా, చారిత్రకమైన పరిస్థితులవల్ల ఆ విషయమై అపోహలు వచ్చినవి గనుక దానిని విరమింపజేయవలసినదని స్పీకరుగారిని తాము కోరినట్లు, ఆయన అంగీకరించినట్లు ఒక స్టేట్‌మెంటు చేశారు. ఆ స్టేట్‌మెంటు పైన కూడా ఏదో కొంత చర్చ చేద్దామని, ఒకప్పుడు కాంగ్రెసులో ఉండి, తర్వాత ముస్లిం లీగులో చేరిన అమీత్‌ఖాన్ లేచేసరికి స్పీకరుగారు, "ఈ విషయం ఇంతటితోసరి; మరి ఎవరికీ ఏమీ మాట్లాడడానికిలేదు" అని నిస్సందేహంగా చెప్పడంతో ఈ ప్రార్థన సమస్య తీరిపోయింది.

ఇంగ్లీషు పార్లమెంటులో మాత్రం కామన్సుసభ ఆరంభ సమయానికి ఆరు నిముషాలు ముందు అంతా చేరి ప్రార్థన జరిపిన తరువాతనే, మిగిలిన కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇది వారికి ఏడువందల ఏండ్లనుంచి ఏ అవాంతరం లేకుండా సాగుతూన్న సంప్రదాయము. మన దేశంలో స్వాతంత్ర్యం పొందే ముందు సాంబమూర్తిగారు ఒక్కరే ఈ సంప్రదాయం నెలకొల్ప డానికి యత్నించారు. అయితే, అది పైన చెప్పిన విధంగా ముగిసి పోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈప్రసక్తి ఎప్పుడూ ఏ శాసన సభలో కాని, పార్లమెంటులో కానీ ఎవరూ తేలేదు. తెచ్చినా, సాగుతుందని నాకు తోచదు.

సాంబమూర్తిగారి కొత్త పద్ధతులు

జమీందారీ బిల్లు తరువాత చరిత్ర కొంచెం సూచిస్తాను. ఈ బిల్లు విషయమై దేశంలో ప్రబలిన వాతావరణం విషయమై లోగడ కొంత సూచించాను. బిల్లు చర్చకువచ్చే రోజున సెనేట్ హవుస్ ఆవరణమంతా ప్రజలతో కిటకిట లాడుతూంది. ఇంతేకాక, సభా కార్యక్రమం చూడడానికి పాసులు అడిగేవారి సంఖ్యకూడా చాలా హెచ్చు