పుట:Naajeevitayatrat021599mbp.pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన రూపంగా శాసన సభ ముందుకు రావడానికి నోచుకోలేదు. ఆ విషయం క్లుప్తంగా చెప్తాను.

3

జమీందారీ ఎంక్వైరీ కమిటీ నివేదిక

ప్రప్రథమంగా, జమీందారీలకు సంబంధించిన తీర్మానాలు శాసన సభలో ప్రతిపాదించి నపుడు కొంతమంది సభ్యులు అడ్డుపెట్టిన మాట వాస్తవము. అయితే, అవి సంప్రదాయ రీత్యా పెట్టిన అభ్యంతరాలని భావించాము. కాని, రానురాను పరిశీలన సాక్ష్యసేకరణ జరుగుతున్న సమయంలో ప్రీవీకౌన్సిల్ తీర్పులు ఏ పరిస్థితులను స్థిరపరిచాయో ఆ పరిస్థితులకు భిన్నంగా కమిటీవారు సేకరిస్తున్న సాక్ష్యం ఉన్నదని, అలా చేయడం న్యాయవిరుద్ధమని మొదలుగాగల వాదాలు పత్రికల మూలంగా బయలుపడి ఒక నూతన, వైషమ్యాత్మకమైన వాతావరణాన్ని కలిగించాయి. ప్రీవీ కౌన్సిల్ తీర్పుకు వ్యతిరేకంగా మనం శాసనం చేయవచ్చునా - చేయరాదా అన్న ప్రశ్న, శాసన సభలకు గల హక్కు లేమిటన్న ఒక ఉప ప్రశ్న, దాని పైన శాసన సభ్యులకు గల విజ్ఞాన పరిమితులు మొదలుగాగల విషయాలన్నీ చదువుకొన్న పెద్దలు రచ్చబండపైకి తీసుకు రావడం తటస్థించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్టు ముఖ్యమా? లేక ప్రజల హక్కు, అధికారం, సుఖ దు:ఖాలు అన్నవి - అనగా "ప్రజాస్వామ్యం" ముఖ్యమా? అన్న మౌలిక సమస్య పరిష్కారం చేయవలసిన సమయం వచ్చింది. దీనితో, ప్రకాశంగారికి ముఖ్యమంత్రిగారు విముఖులయ్యారనే కింవదంతి శాసన సభలోను, వార పత్రికలలోను, క్లబ్బులలోను ప్రబలింది. కమిటీ ఆరంభించిన నాలుగైదు నెలలకు ప్రకాశంగారు, ముఖ్యమంత్రిగారు పరస్పర సంభాషణలు మానుకున్నారనే మాటకూడా ఎక్కడబడితే అక్కడ చెప్పుకొంటూ వచ్చారు. మంత్రివర్గంలో కూడా మంత్రులు రెండు పక్షాలై