పుట:Naajeevitayatrat021599mbp.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ మాట వచ్చినప్పుడెల్లా ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. కమిటీలో ఒక జమీందారు సభ్యుడుగా ఉండేవారు. ఆయనకు సహాయంగా ఒక శాసన సభ సభ్యుడు (ముస్లిం లీగు) ఉండేవారు. చర్చలు ఎంత రహస్యంగా ఉంచినా అవి ఇంతో అంతో బయటకు వచ్చేవి. అలా వచ్చే వాటిలో సగమే సత్యముండేది. ఈ అర్ధ సత్యం పూర్తి అసత్యంకన్న ప్రమాదకరమన్న విషయం రుజువైంది.

ఒకరోజు డ్రాప్ట్‌లో జమీందార్లందరు దేశ ద్రోహులు (Traitors) అని వ్రాశారు. దానిపైన నేను, 'అంతమందీ దేశ ద్రోహులు ఎలా అవుతారు? మనమే కోరి విజయనగరం రాజాను మెంబరుగా చేర్చుకున్నాం కదా' అని, ఆ వాక్యం సవరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ప్రక్కన పెన్సిలుతో వ్రాశాను. ప్రకాశంగారికి దాని వల్ల నా మీద చాలా ఆగ్రహం కలిగింది. అప్పట్నుంచి డ్రాప్ట్‌లు పూర్తి అయ్యేవరకు నాకు పంపించడం మానివేశారు. ఆ కోపం తగ్గాక, ఆ విషయం ఆయనా, నేనుకూడా పట్టించుకోలేదు.

ఈ లోపున కమిటీ కార్యదర్శిగా, 1786 దగ్గరనుంచి రెవిన్యూ శాఖ పెర్మనెంటు సెటిల్మెంటుకు సంబంధించిన పాత రికార్డులు, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ తీర్పులు, ప్రభుత్వపు ఆర్డర్లు, తీర్మానాలు, అంతకు పూర్వం జమీందారీకి సంబంధించిన శాసనాలు, పెర్మనెంటు సెటిల్మెంటుకు మూలమైన అన్ని కాగితాలు - సేకరిస్తూ ఉంటే ఆ చర్య అంతా ఒక ఆధునిక మహాభారతమై, చూసేవారికీ వినేవారికీ మహాశ్చర్యం కలిగించింది. ఈ సంఘానికి ప్రకాశంగారు అధ్యక్షులు కావడంచేత, తమకు లాభం తప్పక కలుగుతుందని, కరాచీకాంగ్రెసు తీర్మానం ప్రకారం మధ్యవర్తులైన జమీందారులు పోతారనీ, జమీందారీ విధానం అంతం కాగలదనీ రైతులు ఆశపడ్డారు. ప్రకాశంగారు ఒకప్పుడు జమీందారుల తరపున న్యాయవాదిగా ఉండడంచేత, న్యాయవాది గనుక ప్రీవీకౌన్సిలువంటి ఉన్నత న్యాయస్థానపు తీర్పులను గౌరవించే తీరుతారని, సంఘంలో జస్టిసు పార్టీకి చెందిన ఒక జమీందారు, వారికి బలంగా ముస్లింలీగువారు కూడా ఉండడంచేత పరిస్థితులు అంతగా విష