పుట:Naajeevitayatrat021599mbp.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినప్పటికీ, ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయమై నియోజక వర్గంలో అభ్యంతరాలు ఉన్నాయనీ, దాని తుది నిర్ణయం కేంద్ర కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డువారికి వదిలి వేయాలని ఆ ప్రత్యేక కమిటీవారు తీర్మానించుకొన్నారు. రాష్ట్రం అంతా అభ్యర్థుల్ని నిలబెట్టే అధికారం, పలుకుబడీ కలిగిన ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయంలోనే అనుమానం ఏర్పడిన పరిస్థితి కలిగింది. రాజకీయాలలో ఇటువంటి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి.

అప్పటికి కొన్ని సంవత్సరాల ముందునుంచి రాజాజీ రాజకీయాలలో అట్టే జోక్యం కలుగచేసుకోకుండా, దూరంగా ఉండేవారు. 1936 లో జరిగిన లక్నో ఏ. ఐ. సి. సి. సమావేశంలో ఎలక్షన్‌లో కాంగ్రెసువారు పాల్గొని మంత్రివర్గాలు ఏర్పాటు చేయాలని నేను వాదించి ఉపన్యసించినపుడు ఆయన సభానంతరం నన్ను చాలా ప్రశంసించారు. అది దూరంగా ఉన్న పెద్దలు చేసిన ఆశీర్వాదపూర్వక ప్రశంసగా భావించారు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలలోకి తిరిగివచ్చే అభిప్రాయం ఉన్నట్టు ఆ నాడు ఎవ్వరమూ గ్రహించలేక పోయాము. ఇప్పుడు అభ్యర్థులను నిర్ణయించే సమయంలో ఆయన ఇతరులకు తెలియకుండానే హెచ్చు జోక్యం కలిగించుకోవడం జరిగింది. వల్లభభాయి పటేలుగారు కేంద్ర పార్లమెంటరీ బోర్డు తరపున ఆంధ్ర, తమిళ, కేరళ, కర్నాటక అభ్యర్థుల జాబితాలను పరిశీలించి, చెన్నపట్నం విషయం మాత్రం - అంటే ప్రకాశంగారి అభ్యర్థిత్వం విషయం అంతా బొంబాయిలో నిర్ణయిస్తానని, అక్కడికి రావలసిందని ప్రకాశంగారిని కోరారు. వల్లభభాయి పటేల గారు బయలుదేరిన బండిలోనే రాజాజీ కూడా కూచుని వెళ్ళడం తటస్థించింది. ఆ బండిలోనే ప్రకాశంగారు వేరుగా మరోపెట్టెలో కూచున్నారు. ఆ రైలు చెన్నపట్నం స్టేషను నుండి బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు - రాజాజీ, పటేలు కూచున్న బండి ఎక్కడానికి తొందరగా వెతుక్కుంటూ వచ్చారు. ఆ కంపార్టుమెంటులోకి ఎక్కగానే రాజాజీ దేశభక్తుని అతి గౌరవంగా లోపలికి పిల్చి, పటేలుగారి