పుట:Naajeevitayatrat021599mbp.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాసభలలో కూడా ఒక నిర్ణయానికి రాగలిగితిమి. ఆ కారణంచేత ఆంధ్రప్రాంతంలో ఎన్నికల వాతావరణం జయసూచకంగానే ఉండినది.

ప్రకాశంగారు లోగడవలెనే రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా ఉండేవారు. చెన్నరాష్ట్రం ఉమ్మడిరాష్ట్రం కావడంచేత ఆంధ్ర, తమిళ, కేరళ, కర్నాటక భాగాలన్నిటిపైనా యాజమాన్యం గల ఒక ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని నాలుగు రాష్ట్రాల కాంగ్రెసు అధ్యక్షులతో ఏర్పాటు చేయడమైనది. ఈ ప్రత్యేక సంఘానికి ఒక్క చెన్నపట్టణ నియోజక వర్గాల విషయంలోనే బాధ్యత ఉండినది. రాష్ట్రంలోగల ఇతర ప్రాంతాలలో రాష్ట్రసంఘంవారి ఏర్పాట్ల ప్రకారమే అభ్యర్థులను నిర్ణయించుకోవడం జరిగింది.

ప్రకాశంగారి అభ్యర్థిత్వము

1907 లో బారిష్టరు వృత్తి నారంభించినది మొదలు అప్పటి వరకు - అంటే ముఫ్పై సంవత్సరాలుగా ప్రకాశంగారు చెన్ననగర నివాసి కావడంచేత, ఆయన చెన్నపట్టణానికి ఏర్పటైన నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉండగలరని మా అందరి ఊహ. అలాగే నియోజక వర్గంలోని నగరవాసులూ ఊహించారు. అయితే ప్రత్యేక సంఘంలో తమిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన సత్యమూర్తి అనే ఆయన మొదటినుండీ తెలుగువారికి చెన్నపట్నంలో ఏవిధమైన పలుకుబడీ ఉండకూడదని ఒక గట్టి అభిప్రాయం గలవారు. అందుచేత, ప్రకాశంగారు గోదావరి జిల్లా నియోజక వర్గంలోంచి వస్తే బాగుంటుందని ఆయన ప్రకాశంగారి పేరు చెన్నపట్నం నియోజక వర్గం అభ్యర్థుల జాబితానుంచి తప్పించారు. ప్రకాశంగారు ఇది తెలిసి "ఇలా ఎందుకు జరిగిం"దని అడిగితే, బాబు రాజేంద్రప్రసాద్‌గారి కోరికపై ఇలా చేయడమైందని సత్యమూర్తిగా రన్నారు. అది కేవలం అభూత కల్పనగా ఉందని ప్రకాశంగారికీ, మాకూ కూడా తోచి, రాజన్‌బాబుగారిని ఈ విషయమై అడిగాము. వారు దాంతో తమకు ఏ విధమైన ప్రసక్తీ లేనట్టు చెప్పారు.