పుట:Naajeevitayatrat021599mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1886 లో నేను థీయిస్టిక్ హైస్కూలులో శివకుమారస్వామి శాస్త్రిగారి ప్రధానాధ్యాపకత్వం కింద, 5 వ క్లాసు చదివాను. ఆ రోజుల్లో హనుమంతరావు నాయుడుగారు నేనంటే ఎంతో ఆప్యాయంగా వుండేవారు. 1886 లో కమిటీ ఆధ్వర్యంకింద వుండే ఇన్నీసుపేటహైస్కూలు, ఏలూరి లక్ష్మీ నరసింహంగారు స్థాపించిన థీయిస్టిక్ హైస్కూలూ కలిసిపోయాయి. ఇన్నీసుపేట హైస్కూలు కమిటీవాళ్లు స్కూలు, ఆధ్వర్యవమూ కూడా ఏలూరి లక్ష్మీనరసింహంగారికే అప్పచెప్పారు. అల్లా ఏకమైన ఆ స్కూల్లో మెట్రిక్యులేషన్ చదివాను. ఆ స్కూలు మొదట కాలేజీదగ్గిర వుండే పూరి ఇంట్లో వుండేది. తరవాత అక్కడినించి నాళంవారి సత్రానికి ఎదురుగా వున్న చిత్రపు నరసింహారావుగారి ఇంట్లోకి మార్చబడింది. ఆ స్కూలుకి వేదం వెంకటాచలంగారు ప్రథానోపాధ్యాయులుగా వుండేవారు.

6

నాటకాలు

ఈ కాలంలో రాజమహేంద్రవరంలో కూడా నాటకాల గొడవ ప్రారంభం అయింది. నేను రాజమహేంద్రవరం చేరేసరికే కందుకూరి వెంకటరత్నం, దాసు మాధవరావు ప్రభృతులు ఇంగ్లీషులో షేక్సుపియర్ నాటకాలు ఆడుతూ వుండేవారు. మా హనుమంతరావు నాయుడుగారికి వుండే నాటకాల పిచ్చికి అంతం లేదుగదా! దాంతోబాటు మాకు పిళ్లారిసెట్టి త్రయంబకరావు అనే ఒక కంట్రాక్టరు తోడైనాడు! అతను ఆనాటి నాటకాలకి కావలసిన డబ్బూ, హంగూ సమకూర్చేవాడు.

సుప్రసిద్ధకవిశేఖరులైన బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మినరసింహం గారు అప్పటికి మెట్రిక్యులేషను పాసయ్యారో లేదో జ్ఞాపకం లేదు. అప్పటికి ఆయనదృష్టి ఇంకా బాగానే వుండేది; కళ్ళు జబ్బుగా వుండడమే గాని అంధత్వం రాలేదు. అప్పట్లో ఆయనకి అంత ప్రసిద్ధిలేదు.