పుట:Naajeevitayatrat021599mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాకు ఆయన నాటకాలు వ్రాయడమూ, మేము ఆడడమూ జరుగుతూ వుండేది. కొన్ని నాటకాలు ఆయన మా కోసమే వ్రాశారంటే ఏమీ అతిశయోక్తి లేదు.

నాకు గయోపాఖ్యానం, పారిజాతాపహరణం నాటకాల సంగతి బాగా జ్ఞాపకం వుంది. గయోపాఖ్యానంలో నేను గయుడి భార్య అయిన చిత్రరేఖ వేషమూ, ఆ తరవాత వెంటనే అర్జునుడి వేషమూ వేసేవాణ్ణి. హనుమంతరావు నాయుడుగారు గయుడి వేషం వేసేవారు. వెంకటకృష్ణుడు, రామకృష్ణుడు అని ఇద్దరు నటులు వుండేవారు. సామాన్యంగా రామకృష్ణుడు ప్రధానపాత్ర ధరిస్తూ వుండేవాడు. అయినాల తాతయ్యనాయుడు సంజయుడి వేషం వేసేవాడు. ఇంతకాలమైన తరవాత నాకిప్పుడు మిగిలిన వాళ్ళపేర్లు జ్ఞప్తికి రావడంలేదు. సామాన్యంగా ఈ నాటకాలకి ముఖ్యపాత్రలం నేనూ నాయుడుగారే. నాకు ఈ నాటకాల గొడవవల్ల "సంగీతముచేత బేరసారము లుడిగెన్" అన్నట్లు చదువు బాగా సాగలేదు.

సాగకపోవడమే కాదు! నాకు 1887వ సంవత్సరం డిసెంబరులో మెట్రిక్యులేషన్ పరీక్షపోయింది. అంతేకాక, ఈ నాటకాల మూలాన్ని రౌడీ జనాభాతో భేటీ రావడం, ఒక విధమైన నిర్లక్ష్యమైన జీవితానికి అలవాటుపడడం జరిగింది. హనుమంతరావునాయడుగారు ఈ నాటకాలు తయారుచేసుకుని అమలాపురం, కాకినాడ మొదలైన పట్టణాల్లో ఆడించారు.అందువల్ల అక్కడి రౌడీ జనాభాతో పౌరుష జీవనానికి, నిర్లక్ష్యమైన జీవనానికి అలవాటుపడ్డాను. 'మామూలు సాంసారిక దృష్టిలో కొంచెం న్యూనమైన జీవితంలో పడిపోతున్నానా?' అనే స్థితి వచ్చింది. హనుమంతరావునాయుడుగారు నన్ను నాటకాలలో ప్రవేశపెట్టినా, నా నైతికాభివృద్ధీ, విద్యాభివృద్ధి, క్షేమాభివృద్ధీ కావడానికి శక్తివంచన లేకుండా పాటుపడేవారు. నా లోపాలకీ, పతనానికీ ఆయన ఎంతమాత్రమూ బాధ్యులు కారు. పరీక్ష పోగానే వెంటనే మళ్ళీ రాజ