పుట:Naajeevitayatrat021599mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ధనార్జన బాగా చెయ్యడం వల్ల దేశస్థుల వ్యామోహం అటు తిరిగింది. అది : సుమారుగా ఆ కాలపు స్థితి.

నేను రాజమహేంద్రవరం చేరేసరికి మనదేశంలో రాజ మహేంద్రవరంలో గవర్నమెంటు కళాశాల, బందరులో మిషన్ కళాశాల మాత్రం వున్నాయి. ఈ కాలేజీలలో చదవడానికి జనం కావాలి గనక, ప్రభుత్వం ప్రైవేటు హైస్కూళ్ళకి ఎన్నిటికో ప్రోత్సాహం ఇచ్చింది. ఇప్పటి మాదిరిగా ఈ స్కూళ్ళమీద లేనిపోని నిషేధాలు ఏమీ వుండేవి కావు. విద్యాధికులు కొందరు చేరి హైస్కూళ్ళు స్థాపించడానికి అవకాశం వుండేది. పైగా, కిరస్తానీ మిషనరీలు కూడా ఆ పనికే పూనుకున్నారు. ఒంగోలు, ఏలూరు, బెజవాడల్లాంటి పట్టణాల్లో ఇల్లాంటి మిషన్ స్కూళ్ళు అనేకం నడపబడుతూ వుండేవి.

రాజమహేంద్రవరంలో అప్పటికి - అనగా 1886 సంవత్సరానికి - మిషన్ హైస్కూలు, థీయిస్టిక్ హైస్కూలు, ఇన్నీసుపేట హైస్కూలు, మరాటా హైస్కూలు అని నాలుగు ప్రైవేటు హైస్కూళ్ళు ఉండేవి. కొత్తగా పాసయిన బి.ఏ.లు యఫ్.ఏ.లు వీటిలో ఉపాధ్యాయులుగా చేరి పనిచేస్తూ వుండేవారు. అప్పట్లో న్యాయవాది పనే గొప్పగా వుండేది. కొందరు పరీక్షకి చదువుకునే లోపుగా కొంతకాలం మాస్టరీ ఉద్యోగం చేస్తూ వుండేవారు. ముత్తుస్వామయ్యరు అనే ఆయన మార్కెట్టుకి ఎదురుగా వున్న మారాటా హైస్కూలు నిర్వహిస్తూ వుండేవారు. ఇన్నీసుపేట హైస్కూలుకి అప్పుడు వేదం వెంకటాచలం అనే ఆయన హెడ్మాస్టరుగా వుండేవారు. మా థీయిస్టిక్ హైస్కూలుకి అప్పుడే బి.ఏ. పాసయిన శ్రీ పి.వి. శివకుమారస్వామి శాస్త్రిగారు ప్రధానోపాధ్యాయులు. తరవాత ఆయన మనదేశంలో కల్లా గొప్ప విద్యావేత్తగా ప్రఖ్యాతి పొందారు. సైదాపేట కాలేజి ప్రిన్సుపలు పనిచేసి విరమించారు. ఈ మధ్యనే కీర్తి శేషులయ్యారు. రామానుజాచారి అనే ఆయన కూడా మాస్టరుగా వుండేవారు. ఆ తరవాత ఆయన డిప్యూటీకలెక్టరు కూడా అయ్యారు. ఆ రోజుల్లో వీరేశలింగం పంతులుగారు కాలేజీలో తెలుగుపండితులుగా ఉండేవారు.