పుట:Naajeevitayatrat021599mbp.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ళ్ళాటకి గురియై భీతిల్లి పోవడమూ, చిందర వందరగా అన్ని దిక్కులకూ పారిపో ప్రయత్నించడమూ సహజమేకదా?

నా దృష్టి అ గుర్రపు రౌతుల చర్యలపైకి మరలించబడింది. ఆ గుర్రపు దాట్ల మధ్య ఇరుక్కుని దెబ్బలు తిన్న ఒక వ్యక్తిని ఉపన్యాస వేదిక వద్దకు మోసుకుని వచ్చారు. ఆ మనిషిని జనానికి చూపుతూ, "ఆగండి! పరుగులెత్తకండి. ఉన్న తావులలోనే కూర్చోండి. భీతిచెంది పరుగులు పెడితే, పారిపోయే గుంపులమీదకి మళ్ళించబడిన గుర్రాలవల్ల ఇంకా ఎక్కువగా దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది సుమా!" అని హెచ్చరించాను. ప్రజలు నిశ్చలంగానూ, శాంతియుతంగానూ కూర్చుంటే, వారిమీదకి రావడానికి ఆ ఆశ్విక దళాల వారికి దమ్ము లుండవనీ చెప్పాను.

తరవాత ఆ 'సావర్సు'ను హెచ్చరిస్తూ, "నిజంగా మీకు అలజడి కల్గించి అల్లరి చెయ్యాలి, సభను చెదర గొట్టాలి అనే అభిప్రాయం ఉంటే, దూర దూరంగా అక్కడక్కడ చెదురు మదురుగా కూర్చున్న ప్రజల మీదికి గుర్రాలను పోనివ్వడం కంటె, నిశ్చింతగా కూర్చుని ఉన్న ఆ ప్రజానీకం మధ్యనుంచి తిన్నగా, గుర్రాలను అదలించుకుంటూ, మా అందరిపై నుంచీ పోనీయడం సబ"బని చెప్పాను.

కొన్ని నిమిషాలపాటు అలా అలజడి కలిగించి, జనంలో ఇద్దరు ముగ్గురికి దెబ్బలు తగిలిన తర్వాత, వాళ్లంతా ఇంకే విధమయిన అల్లరి లేవదీయకుండా రోడ్డుమీదకి వెళ్ళిపోయారు. ఆ తరవాత సభ సాంతం అయింది.

ఆ ఉపన్యాస వేదికమీద ఉన్న స్త్రీలు, కొంత భీతిపుట్టి, సభాస్థలిని విడిచి వెళ్ళిపోవాలని తలచారు. కాని కొద్ది నిమిషాలలోనే వారు తేరుకుని, వారి స్థానాలను వదలకుండా అంటిపెట్టుకునే ఉండిపోయారు.

ఆ సభకి హాజరయిన జనం పారిపోవడానికి ప్రయత్నించకుండా కూర్చుని ఉండడమే మన బలాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ ప్రభుత్వం వారికి ప్రదర్శించిందనీ, ఆనాటి వారి ధైర్యసాహసాలే అంతిమ విజయానికి దోహద మిస్తాయనీ ఉద్ఘాటించాను. సభలో నిలద్రొక్కుకుని