పుట:Naajeevitayatrat021599mbp.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమర్శలూ, చిత్ర విచిత్రమయిన అభిప్రాయాలూ వెల్లడించేవారు. అందులో కొన్ని పత్రికలు ఆంగ్లేయులచేతా, ఆంగ్లో ఇండియన్లచేతా నిర్వహింపబడేవి. వాటిలో మా ఉప్పు సత్యాగ్రహ సమరాన్ని ఇష్టమొచ్చినట్లుగా వేళాకోళం చేసేవారు. 'భారతదేశంలాంటి ఒక పెద్ద దేశానికి స్వాతంత్ర్య సంపాదనకోసం సముద్రపు టొడ్డున ఉప్పుకల్లులు ఏరుతారట!" అంటూ రకరకాలుగా వేళాకోళాలు చేసేవారు. కార్టూనులు వేసేవారు. గాంధీగారనే చిట్టెలుక తనకున్న ఆ కొద్దిపాటి మీసాలతో తోక ఆడించుకుంటూ, ఉప్పుకల్లులు ఏరడానికి, తద్వారా దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికీ ప్రయత్నిస్తున్నదని వేళాకోళంగా కార్టూన్లు వేసేవారు.

శాసన సభా వాతావరణం

కేంద్ర శాసన సభా వాతావరణమంతా అటువంటి ఉద్దేశాలతోనే నిండి, అటువంటి ఆశ్చర్యాలకీ ఆలవాలమై ఉండేది. సిసలయిన కాంగ్రెసు వారంతా శాసన సభని వదలి 'ఉప్పు' కోసం బయటకు నడిచారుగా! వారి కిదంతా ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని కలిగించేది. అసలు ఆ సభలో ఉప్పు సత్యాగ్రహ సమరంమీద పూర్తి విశ్వాసంతో ఉన్నవాణ్ణి నేను ఒక్కడినే. శాసనసభలో ఉన్న యావన్మందికీ నా అభిప్రాయలూ, ఆశయాలూ పూర్తిగా తెలిపి ఉండడాన్ని నన్ను చూస్తే అందరికీ జాలిగా ఉండేది. వారి దృష్టికి బలిపీఠానికి తీసుకుని పోబడుతూన్న మేకలా కనబడ్డానేమో! ట్రెజరీ బెంచీల వారికీ, తదితర శాసన సభ్యులకీ ఈ మూడు సంవత్సరాలలోనూ నన్నుగురించి బాగా తెలిసికోవడానికి సావకాశం ఉందిగదా! వారికి ఆ అసెంబ్లీలోనే, శాసనధిక్కారంచేసి, స్వరాజ్యం సంపాదించడానికిగాను పధ్నాలుగుమందితో ఒక కంపెనీ ఏర్పడ్డదని తెలియదు.

మేము టీ తీసుకుంటూ ఉండగా ట్రెజరీబెంచీలకు సంబంధించిన ఒక ఆంగ్లేయ మిత్రుడు నన్నుగురించి కాస్త బాధపడి, ఆ లాబీలో ఒక చిన్న ప్రసక్తి లేవదీశాడు. "ఎంత తెలివి తక్కువ వాడవయ్యా! సముద్రపు ఒడ్డున ఏరిన ఉప్పుగల్లులతో 'స్వరాజ్యం' వస్తుందని ఎల్లా