పుట:Naajeevitayatrat021599mbp.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోయంబత్తూరు జెయిల్లో ఆయనకు దెబ్బతగిలిన కారణంగా ఆయన్ని విడుదల చేశారనీ, దర్మిలా ఆయన చనిపోయారనీ విని మరీ యెక్కువగా బాధపడ్డాను. ఆయన్ని నేను బలవంతంచేసి ఉండకపోతే ఆయన అలా బ్రతికి ఉండేవారేమో! ఈ సంఘటన జరిగి ఇన్నాళ్ళయినా ఈ విషయాన్ని మాత్రం ఇంకా మరవలేకుండా ఉన్నాను. ఈ ప్రకారంగా మా పార్ల మెంటరీ విధానం సాంతం అవడమూ, విఠల్‌భాయ్ పటేలూ, మాలవ్యా పండితుడూ, నేనూ 1930 లో జెయిళ్ళలో మ్రగ్గడమూ సంభవించింది.

8

నా సత్యాగ్రహ సమర శంఖారావం

రాజీనామా ఇచ్చి కేంద్ర శాసన సభనుంచి బయటికి వచ్చే సందర్భంలో నేనిచ్చిన ఉపన్యాస విషయం కాస్త వివరించాలని ఉంది. ఉప్పు సత్యాగ్రహసంరంభం ఆరంభం అయ్యే ఆ పవిత్ర ఘడియల్లో కాంగ్రెసేతరవర్గానికి చెందవలసి వచ్చిన నేను, శాసనసభ ద్వారా సభ్యులకూ, దేశానికీ సందేశం ఇవ్వగలిగినందుకు గర్విస్తూ, ఆ ఉపన్యాసం ఇచ్చాను. అలాంటి అవకాశం నాకు కలగడం నిజంగా గర్వకారణంగానే భావించాను.

నేను ఆ ఉపన్యాసం ఇచ్చేనాటికి గాంధీగారు 'దండీ'కి వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఆయన తన ఆశ్రమవాసు లయిన స్త్రీ పురుషులతో కలిసి సత్యాగ్రహ సమరం ఆరంభించడానికి సబర్మతీనుంచి దండీప్రాంతానికి కాలినడకని వెడుతున్నారన్నమాట. సబర్మతీ ఆశ్రమానికీ దండీకి మధ్య ప్రయాణం 21 రోజులు. అక్కడికి జేరి అ సముద్రపు టొడ్డున లభ్యమయ్యే ఉప్పుకల్లులను ఏరుకోవాలన్నమాట!

దారిలో చాలా చిత్రమయిన సంఘటనలే జరిగాయి. ఈ విషయాలన్నీ అనుదినమూ వార్తాపత్రికలద్వారా వస్తూనే ఉండేవి. అంతే కాదు, మన "మిత్రులు" పత్రికలలో పడ్డ వార్తలతో పాటు రకరకాల