పుట:Naajeevitayatrat021599mbp.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థితులనుబట్టీ మారవచ్చు"నన్నారు. అంతేకాదు - అఖిల పక్ష సమావేశం వారి ప్రతిపాదనలను వ్యక్తంచేస్తూ, "ఇవి మా కోరికలు. ప్రభుత్వం వారు మా కోరికలను మన్నించి, దేశానికి రాజ్యాంగరీత్యా యివ్వగలిగినంత సహకారమూ ఇవ్వా"లని కోరారు.

జిన్నా కప్పదాటు

ఇది కేవలం 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని పూర్తిగా తిరగ దోడుకుని క్షమార్పణ చెప్పుకున్నట్లే అయింది. అప్పట్లో ఆయనకున్న వ్యాకుల చిత్తంతో, అంతకంటే ఎక్కువగా దేశానికి ఆయన యేమీ కోరలేకపోయాడు. ఆఖరి ఘట్టాలలో తీసుకురాబడిన అభ్యంతరాలతో అధ్యక్షుడుగా ఆయన తయారుచేసిన ఆ నెహ్రూ కమిటీ రిపోర్టు గాలికి కొట్టుకుపోయింది.

అప్పటివరకూ అన్యదేశాలలో పర్యటిస్తూన్న జిన్నా సాహెబుగారు ఆ సమయానికి పర్యటన పూర్తి చేసుకుని రావడాన్ని, ఆ నెహ్రూ కమిటీ ప్రతిపాదనలకు అడ్డుపడ్డాడు. కీ॥ శే॥ మహమ్మదాలీగారు ఆ రిపోర్టులో ఎన్నో సవరణలూ, మార్పులూ, కూర్పులూ, చేర్పులూ చేశారు. కాని జిన్నాగారు మాత్రం సభలో అది నడవడానికి నిర్ణీత అవసరమైన సంఖ్యగా సభ్యులు సరిపడ్డంతమంది లేరంటూ దాటేశాడు.

ఆరంభంలో ఎంతో ధీమాగానూ, శక్తిమంతంగానూ పనిచేసిన ఆ అఖిల పక్ష సమావేశం క్రమేణ దిగజారిపోయి, భిన్నాభిప్రాయాలతో చీలికలయిపోయింది, ఆ ఆఖరు ఘడియలలో అచ్చట ఉన్న మాలో చాలా మందికి వారి వారి భావాలు, ఆ నెహ్రూ రిపోర్టును సాంతంగా 'నీట' ముంచుదామనే ఆతురతతో వున్నట్లు కనిపించాయి. ఒక్క సంవత్సరం పాటు ఆ రిపోర్టును ఇట్టి సంధిగ్ధస్థితిలో ఉంచడానికి, మౌలానా మహమ్మదాలీ, జిన్నా, ఆగాఖాను కూడా బాధ్యులేనని అనక తప్పదు.