పుట:Naajeevitayatrat021599mbp.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడ్డాయి. కొంతమంది నాయకులకు శాసన ధిక్కారమూ, 'బాయ్‌కాట్‌' తీర్మానాదులలో అంతగా ఆసక్తి లేకపోయినా, ఇది కేవలం బహిష్కరణే గదా, ఇందులో శాసన ధిక్కారాది కార్యక్రమాలు ఏమీలేవు గనుక కమిషన్‌ని 'బాయ్‌కాట్‌' చేసి, హర్తాలు అమలు పరుద్దాం అని, తమలో తాము తర్జన భర్జనలు చేసుకుని, ఒక నిర్ణాయానికి వచ్చారు.

దేశం ఈ తీర్మానాన్ని ఆసక్తితో అమలు పరచింది. కమిషన్ ఎక్కడకు వెళ్ళినా నల్ల జెండా లెదురయ్యాయి. అందువల్లనే ఈ బహిష్కరణ అంత ఘనంగా సాగింది. ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, శ్రీనివాసయ్యంగారి భుజస్కంధాల మీదనుంచి, ఆ 1927 డిసెంబరులో డా॥ అన్సారీగారి భుజాలమీదికి వాలి ఊరుకుంది.

సక్లత్‌వాలాకి విందు

బ్రిటిష్ పార్లమెంట్‌లో భారతీయ సభ్యుడుగా ఉంటూ ఉన్న సక్లత్‌వాలా 1927 లో హిందూ దేశానికి వచ్చాడు. ఆయన కేంద్ర శాసన సభా కార్యక్రమాన్ని వీక్షించి, ఆ శాసన సభా సభ్యులలో ముఖ్యులు అనుకున్నవారందరితోనూ, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితిని గురించి తర్కవితర్కాలు చేశాడు.

ఆయన చాలా ఉత్సాహవంతుడూ, మంచి తెలివయిన వాడూను. కాని తన దేశభవిష్యత్తు ఏమిగానున్నదో అనే వ్యాకులంతో చాలా మన:క్లేశంలో ఉన్నాడు.

ఆయన రాకను పురస్కరించుకుని కేంద్ర శాసన సభలోని కాంగ్రెసు మెంబర్లంతా కలసి ఆయన గౌరవార్థం ఒక పెద్ద ప్రాత:కాల విందును ఏర్పరచారు. నాతో ఆయన సంప్రతించిన సందర్భంలో దేశం యావత్తూ ఒక్క త్రాటిమీద, ఒక్కమాట మీద ఉండి, సంఘీభావంతో వ్యవహరించా లన్నారు. తాను జన సమూహంతో కలిసిమెలిసి ఏ విధమయిన కార్యక్రమమూ ఎప్పుడూ జరుపలేక పోయానని వాపోయాడు. ఇదంతా 1927 మార్చిలో కేంద్ర శాసన సభలో జరిగిన విషయం.