పుట:Naajeevitayatrat021599mbp.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

విఠల్‌భాయ్ పటేల్ విజ్ఞత

కేంద్ర శాసన సభలో ఉన్న కాంగ్రెసు సభ్యులందరమూ కలిసి, మాకు సంబంధించినంత వరకూ ఒక కార్యనిర్వాహక సంఘాన్ని పండిత మోతీలాల్ నెహ్రూగారి అధ్యక్షతను ఏర్పరచుకున్నాము. కొత్తగా ఎన్నికయిన కేంద్ర శాసన సభ్యులుగా మా జీవితం 1927 లో ప్రారంభం అయింది.

నిజానికి మా పార్టీ మంచి పకడ్‌బందీగానే ఎర్పడింది. మంచి క్రమశిక్షణ కలదే. కాని పెద్దలలో కొద్దిగా మనస్పర్థలుండేవి. మోతీలాల్ నెహ్రూగారికి, శ్రీనివాసయ్యంగారికీ ఒక పక్కా, నెహ్రూగారికి లాలా లజపతిరాయ్‌గారికీ ఇంకొక పక్కా కాస్త స్పర్థలుండేవి. ఈ స్పర్థలకు రాజకీయకారణాలే ఉండేవి.

డిన్నర్ పార్టీలు - రంగయ్యర్ సవాలు

కాని కేవలం వ్యక్తిగతమయిన స్పర్థ నెహ్రూగారికీ, సి. ఎస్. రంగయ్యరుగారికీ మధ్య ఉండేది. వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులుగానే ఉండేవారు. అప్పట్లో రంగయ్యరు నాభా మహారాజు కార్యదర్శిగానూ, హితుడుగానూ ఉండేవాడు. గవర్నమెంట్ వారినుంచి తన రాజ్యాన్ని రాబట్టు కోడానికి మహారాజు నెహ్రూగారిని న్యాయవాదిగా పెట్టుకున్నాడు. ఈ కేసు వ్యక్తిగతంగా తేబడిన బాపతే. ఈ సందర్భంలో నాన్పుడు, అభిప్రాయ భేదాలూ ఉండేవి. అల్లా వారిరువురి మధ్యా ఏర్పడిన స్పర్థ శాసన సభలోకి, రాజకీయాల లోకీ ప్రవేశించింది.

ఒకప్పుడు మేము, మా కార్యనిర్వాహక వర్గంలో - వైస్రాయ్‌తోను, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతోను సంబంధించిన సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు, వాటిని పూర్తిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. మోతీలాల్ నెహ్రూగారికి మాత్రం, మొదటి నుంచీ అలవాటయిన కారణంగా, అటువంటి డిన్నర్లకీ, పార్టీలకూ వెళ్ళకుండా ఉండడమంటే అదోలా ఉండేది. వెళ్ళాలనే కోరికే పీకు తూండేదన్నమాట!