పుట:Naajeevitayatrat021599mbp.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బందయిపోయాయి. నేను ఒక కార్డన్ దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న సిపాయిని ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి దారి యివ్వవలసిందని కోరాను. దారి ఇవ్వడానికి వీలులే దన్నాడు.

ఒక సిపాయి నా గుండెకు బారుచేసి తుపాకి పట్టుకున్నాడు. నాకు దారి ఇవ్వవలసిందని వానిని నేను కోరాను. "మీరు బలవంతంగా వెళ్ళదలిస్తే మేము కాల్చవలసి వస్తుం"దన్నాడు వాడు. నా ప్రక్కన గుంపులో ఉన్న ఒక మహమ్మదీయ యువకుడు, "ధైర్యం ఉంటే కాల్చు, మేమంతా సిద్ధంగానే ఉన్నాం! ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది" అని అరిచాడు.

కొద్ది క్షణాల తర్వాత వాడు తప్పుకుని దారి ఇస్తూ, దయయుంచి ఏ గడబిడా చెయ్యవద్దని గుంపును కోరవలసిందని ప్రాధేయపడ్డాడు. నేను వచ్చేవరకూ శాంతంగా ఉండవలసిందని గుంపును కోరి ముందుకు సాగి, గుండుదెబ్బలతో పడిఉన్న ఆ మృతదేహాన్ని చూసి, ఆ రోడ్డుకి ఎదుటి రోడ్డున, హైకోర్టులో వెనుకభాగాన ఉన్న ఒక భవనంలో ఆసీనుడయి ఉన్న చీఫ్ ప్రెసిడెన్సీ మేజస్ట్రేట్‌ను చూడగోరాను.

లాఠీఛార్జీ

ఆ రోజంతా [1]పట్నం అట్టుడికిపోయి ఉద్రిక్త పరిస్థితిలోనే ఉంది. సైమన్ కమిషన్ వారికి ఎదుర్కోలు కేవలం నల్లజెండాలతోనే

  1. ఈ పోలీసు కాల్పులు, ఇతర సంఘటనలు జరిగింది 1928 ఫిబ్రవరి 3 వ తేదీనని కీ. శే. పట్టాభిగారి "కాంగ్రెసు చరిత్ర" (పే. 466)ను బట్టి, డా॥ జి. ఆర్. చౌదరి "ప్రకాశం: ఎ పొలిటికల్ స్టడీ" (పే. 56. పుట్ నోట్ 21) అన్న గ్రంథంవల్ల తెలుస్తూంది. ఆనాడే సైమన్ కమిషన్ బొంబాయి రేవులో దిగింది - యావద్భారతంలోను హర్తాల్ జరిగింది. ఆనాడు మదరాసు సంఘటనలలో మరి యిద్దరు మరణించారని కాంగ్రెసు చరిత్రకారుల కథనం. కమిషన్ వారు మొదటిసారి మదరాసు వచ్చింది ఫిబ్రవరి ఆఖరి వారంలో, మార్చి 31 వ తేదీని తిరిగి బొంబాయిరేవు విడిచారు, మళ్ళీ 1929 లో ఇదే రోజులలో ఇండియాకు వచ్చారు. ఏప్రిల్ 14 నాటికి వారి విచారణ ముగిసింది. మదరాసులో హర్తాలు జరిగింది మూడుసార్లని తెలియవస్తూంది: కమిషన్ ఇండియాలో దిగిననాడు, మదరాసుకు వచ్చిన రెండు దఫాలు.