పుట:Naajeevitayatrat021599mbp.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ కాలంలో ఒంగోలు ప్లీడర్లు అంతా తెలుగు ప్లీడర్లే. అందులో నాగరాజు సూర్యనారాయణరావు అనే ఒక తెలుగు ప్లీడరు ఉండేవాడు. ఎప్పుడైనా నాకు ఏ పుస్తకాలకైనా డబ్బు తక్కువైతే మా అమ్మగారు నన్ను ఆయన దగ్గరకు పంపించేది. మా కుటుంబం పూర్వపు ప్రతిష్ఠ మన్నించి ఆయన నేను ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా నాలుగు అణాలు ఇచ్చేవాడు. ఇప్పటికీ ఆయన నా కళ్ళలో మసులుతూనే వున్నాడు. ఇల్లాంటి నిక్కచ్చిలో మిడిల్ స్కూలుకి 3 రూపాయలు దరఖాస్తు కట్టవలసి వచ్చింది. నేను ఒంగోలుకి 35 మైళ్ళ దూరంలో వున్న మా బావగారి యింటికి నడిచి వెళ్ళాను.

తీరా నడిచి వెళ్ళాక మా బావగారు సాయం చెయ్యలేకపొయ్యారు. కాని నడక అనేది మనకి కొత్త కాక పోవడంవల్ల అట్టే ఆశాభంగం కలగలేదు. నాకు ఒంగోలుకి 10 మైళ్ళలో ఉన్న మా చిన్నక్కగారి ఊరు కొత్తపట్నానికి, మా మేనమామల ఊరు వినోదరాయడిపాలానికి, ఇంకా ఆ దగ్గిర గ్రామాలకీ... నడిచివెళ్ళడం అనే అలవాటు వుంటూనే వుండేది. ఆ నాటి నడక సత్తువే యిప్పటికీ నన్ను బలిష్టంగా వుంచిందని నా నమ్మకము. మా బావగారి దగ్గిర ఆశాభంగం అయ్యాక -- పాపం! మా అమ్మగారే తను కట్టుగునే పట్టుబట్ట తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆ గండంతో నా మిడిల్ స్కూలు పరీక్ష పూర్తి అయింది.

మిడిల్ స్కూలు పరీక్షకి వెళ్ళడానికి ముందే నా మనస్సులో రెండు అభిప్రాయాలు వుండేవి. ఒంగోలులో మా ఇల్లు మునసబు కోర్టుకి యెదురుగా వుందని ఇదివరకే వ్రాశాను. ఆ కోర్టులో ప్లీడర్లు లాంగు కోట్లు వేసుకుని తిరుగుతూ, డబ్బు సంపాదిస్తూ వుంటే నాకు కూడా ప్లీడరీ చెయ్యాలనే సంకల్పం కలిగింది. ఆ లాంగు కోటు మీద ప్రేమ చాలావరకు వెళ్ళింది. మిడిల్ స్కూల్లో చదువుతూ వుండగానే ఒక లాంగుకోటు కుట్టించాను.