లుగా ఉండి నాటకాలంటే అభిమానంగా ఉండేవారు. ముందు ఆయన్ని గురించి విపులంగా వ్రాస్తాను.
అల్లాంటి స్థితిగతుల్లో నేను నాటకాలు పాత్రధారణ ప్రారంభించి, ఆడవేషాల్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించాను. పీష్వా నారాయణరావు వధలో నారాయణరావు పాత్రలో నారాయణరావు పాత్ర నేనే ధరించేవాణ్ణి. అందులో మనకీర్తి బాగా వ్యాపించింది. అందువల్లనే ఊళ్ళో ఉన్న ఉండదల్లీ సాహేబు, హనుమంతరావుగార్లకి అభిమానపాత్రుణ్ణి అయ్యాను. ఆ నాటకాల యావ కొంతవరకు నన్ను ఇతరమైన చిలిపి పనులనుండి కాపాడింది. ఉండదల్లీ సాహేబు మేనల్లుడు ఒకడు మాతో వేషాలు వేసేవాడు. ఎప్పుడూ నాకు తురకల సహవాసం ఉంటూనే ఉండేది. ఆ ఉండదల్లీ సాహేబు ఉర్దూలో పండితుడు. ఆయన ఉర్దూలోనే నాటకాలు వ్రాసేవాడు. మేము తెలుగు లిపిలో ఆ ఉర్దూ వ్రాసుకుని నాటకాలు కంఠస్థంగా వల్లించేవాళ్ళము. ఈ స్థితిలోనే ఒకవైపున నాటకాలూ, రెండోవైపున చదువూ సాగిస్తూ, నేను మిడిల్ స్కూలు పరీక్షకి తయారు కావలసివచ్చింది.
నేను ఈ నాటకాల్లో తిరుగుతూ వుంటే మా అమ్మగారు, అమ్మమ్మగారు కూడా చాలా బాధపడుతూ వుండేవారు. కాని, నేనెప్పుడూ వారి అదుపు ఆజ్ఞల్లో లేకుండా వుండడంవల్ల నన్నేమీ చెయ్యలేకపొయ్యేవారు. కన్న ప్రేమ వల్ల నేను చేసే ఆకృత్యాలన్నీ కాసుకుంటూ వచ్చేవారు. బయట ఎంత అల్లరి చేసినా స్కూల్లో చదువు విషయంలో ఏ లోపమూ లేకపోవడంవల్ల కొంత తృప్తిపడుతూ వుండేవారు. నేను ఆ మిడిల్ స్కూలు పరీక్షకి వెళ్ళడం ఒక బ్రహ్మాండమైన పని అయింది. హోటలు పెట్టుకున్నా మా దారిద్ర్యం తీరలేదు. అందువల్ల వచ్చే ఆదాయం కుటుంబ పోషణకీ, నా చదువుకీ సరిపోయేది కాదు. అందుచేత మా అమ్మగారు నన్ను సంపన్న గృహస్థుల ఇళ్ళల్లో వారాలకి అప్పజెప్పింది. బ్రతికి చెడిపోయిన సంసారం అనే మర్యాద వల్ల ఊళ్ళో వాళ్ళు మా అమ్మగారిని సామాన్యంగా వంటపూటి వాళ్ళని చూసేటట్లు చులకనగా చూసేవాళ్ళు కారు.