Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

రాజమహేంద్రవర ప్రయాణం

ఇంక నా భవిష్యత్తుకి కారణం అయిన రాజమహేంద్రవరాన్ని గురించి వ్రాస్తాను. అది విద్యావంతులకి నిలయమనీ, మహా పండితులకి ఆస్థానమనీ, గోదావరి బ్రహ్మాండమైనదనీ, ఆదేశం తెలిసిన వాళ్ళంతా పండితులవుతారనీ చెప్పుగుంటూ వుండేవారు. నాకు ఆ వూరు, ఎల్లా ఉంటుందో చూడాలని ఒక సంకల్పం వుండేది. నా మిత్రుడు నవులూరి రమణయ్య, నేనూ, మరి కొందరమూ కలిసి ఇళ్ళళ్ళో కూడా చెప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలని ఒక ప్లాను వేశాము.

ఆ కాలంలో ఒంగోలుకి కలరా వచ్చింది. మేము ఉండే చోట ఒక కేసు రావడంవల్ల భయపడి మా అమ్మగారు మమ్మల్ని ధారావారి వీధిలో ఉన్న నిమ్మగడ్డవారింట్లో పెట్టింది. పిల్లి పిల్లలిని పెట్టి ఏడు చోట్లకి తిప్పినట్లు ఆమె మాకు ఎక్కడ ఏమి ఆపత్తు వస్తుందో అని అతి భయంతో అక్కడికీ ఇక్కడికీ మారుస్తూ వుండేది. ఆ నిమ్మగడ్డ వారి ఇంట్లో కొందరు రాజమహేంద్రవరంలో చదువుకుని పండితులై వైదిక విద్యలో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. వారింట్లో ఉండటం వల్ల నాకు రాజమహేంద్రవరం చూడాలనే కోరిక మరింత హెచ్చయింది. ఈ మానసికస్థితిలో మిడిల్‌స్కూల్ పాసయి ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వున్నాను.

అప్పటికి ఆ ఊళ్ళో ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులుగా వుండేవారు. ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయినవారు. ఆయనకి నెలకి 30 రూపాయలు జీతము. ఆయనకి నాటకాలంటే ఉండే అభిరుచిని గురించీ,