పుట:Naajeevitayatrat021599mbp.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశీయుల నిరసన భావం

ఈ ఉత్తరమూ, వైస్రాయిగారి ప్రకటనా పరిస్థితిని మెరుగు పరచడానికి బదులు దేశంలో నాటుకున్న అనుమాన బీజానికి మరింత దోహదం చేశాయి. ఎన్ని విధాలుగా ఆశ చూపించి పురికొల్పాలనుకున్నా, అసెంబ్లీలో ఉన్న కాంగ్రెసు పార్టీ వారు ఎంతమాత్రం చలించలేదు. సహకరించడానికి ముందడుగు వెయ్యలేదు. ఇంత అనుభవం ఉన్న వైస్రాయిగారూ, ఆంగ్ల కాబినెట్ మంత్రులూ కూడా ఏదో ఇంత 'ఎర' చూపి బారతీయుల నోరు కట్టుపడుతుందని ఎల్లా తలచారో అర్థం కాలేదు.

చెన్నపట్నంలోని జస్టిస్ పార్టీవారు మినహా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీల వారందరూ, పేరు బడ్డ యావన్మంది నాయకులూ బ్రిటిషు ప్రభుత్వంవారి భావాన్నీ, హృదయాన్నీ కూడా శంకించారు. అందులో జనరల్ ఎన్నికల ముందు పెట్టుకుని, ఇలాంటి కమిషన్ని ఆంగ్లేయులు ఏర్పరచడాన్ని ప్రతివారూ గర్వించారు. పెద్దలు చాలామంది కమిషన్‌ పట్ల నిరసన తెలిపారు.

దేశం యావత్తూ ఒకే విధంగా వ్యతిరేకంగా ఉన్నా, ఎలాగో ఒకలాగు ఆ (చేదు) మాత్రని భారతదేశీయులచేత మింగించి తీరతాం అన్న పట్టుదలమీదనే ఆంగ్లేయులున్నారు. వైస్రాయికి దేశం ఎంత బిగిమీద ఉన్నదీ పూర్తిగా తెలుసు. 1927 డిసెంబర్‌లో ఈ కమిషన్ బాయ్‌కాట్ ప్రధాన ఉద్దేశంగా, చెన్నపట్నంలో కాంగ్రెస్ జరుగనున్నదన్న సంగతి తెలుసును. వెనుకటి వైస్రాయ్ రీడింగ్ కాలంలో ఎంత బిర్రుమీద, ఏకగ్రీవంగా యావత్తు దేశమూ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకను బహిష్కరించిందో ఇర్విన్ ఎరగనిది కాదు. తన ఏలుబడి కాలంలో ఈ సైమన్ కమిషన్ బహిష్కరణ అన్నది ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా ఇర్విను ప్రభువు ఊహించుకునే ఉన్నాడు.