పుట:Naajeevitayatrat021599mbp.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశం అంటే నేనే, నేనంటే ఆంధ్రదేశమే అన్నంత ఇదిగా దేశానికీ నాకూ అవినాభావ సంబంధం ఏర్పడి ఉంది. అంతేకాదు-ఆంధ్రులు 1907 నుంచీ దేశంకోసం త్యాగాలు చెయ్యడానికి ఎప్పుడూ సంసిద్దులే. అందువల్లనే ఆంధ్రులకు ఏనాడో భారతరాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం లభించింది.

1921-22 సంవత్సరాలలో ప్రప్రథమంగా ప్రారంభించబడిన సహకార నిరాకరణ ఉద్యమంలో అనేక ప్రాంతాలవారు జైలుకు పోవడానికి సంసిద్దులయ్యారు. 1922 లో గుంటూరులో ప్రారంభించబడిన పన్నుల నిరాకరణ ఉద్యమం పట్టుదలతో సాగింది. వందలాది గ్రామాధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా లిచ్చారు. ప్రభుత్వం సాగించిన హింసాకాండను, కాంగ్రెసునూ-దాని విధానాలనూ అణగద్రొక్కడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలనూ ఎదుర్కొనడంలో ఆంధ్రులు కనబరచిన ఐకమత్యం, పట్టుదల, త్యాగశీలం మెచ్చి భారతీయులందరూ ఐక్యకంఠంతో "సెహబాస్ ఆంధ్ర్రా!" అన్నారు.

అదే ఉత్సాహంతో 1926 నాటి ఎన్నికల సంరంభంలో కూడా ఆంధ్రులు ఎల్లా పాల్గొన్నారో ఇక్కడ చెప్పాలి. మామూలు ఎన్నికల ప్రచారం కంటె, మన పది పదిహేను తెలుగు జిల్లాలోనూ త్యాగం, సహనం, వ్యక్తి సత్యాగ్రహం అంటూ ఉపన్యాసాలనిచ్చి ప్రజలను ఉత్తేజితుల్ని చేయడం ఎంతో తేలిక.

దేశం మొత్తంమీద తమ తమ ప్రాంతాలకు ప్రతినిధులను ఎన్నుకోవాలి కదా! అలా ప్రతినిధులను ఎన్నుకోవలసిన నియోజక వర్గాలు బహు విస్తీర్ణం కలవి వేలాది ఓటర్లను కలిగి ఉండేవి. ఎన్నికల విషయంలో కాంగ్రెసు వారికి అనుభవం లేదు. దేశవ్యాప్తమైన ఈ ఎన్నికల సంరంభంలో ఏ విధంగా పాల్గొనాలో, వోట్లంటే ఏమిటో, వాటిని వేసే విధానాలేమిటో, అవలంబించ వలసిన పద్ధతు లేమిటో ప్రజలకు తెలియదు.

ఇంగ్లండు మొదలైన ప్రజాప్రభుత్వ దేశాలలో వలెనే అభ్యర్థు లందరూ ప్రచారం నిమిత్తం, ఏజంట్లకనీ, పనివారికనీ అపరిమితంగా