పుట:Naajeevitayatrat021599mbp.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ జేబుల్లోనుంచి వందలూ, వేలూ ఖర్చుపెట్టవలసి ఉంటుందని ఆఫీసర్ల భావన. ప్రభుత్వంవారూ, కాంగ్రెసు వారికీ వ్యతిరేకంగా నిలబడ దలచిన అభ్యర్థులు కూడా కాంగ్రెసువారు చాలా బీదవారనీ, తమకున్న ఆర్థిక స్తోమతా , పలుకుబడీ, ఎప్పటికీ వారికి కలుగజాలవనీ తలచారు. నిజానికి వారిలో పెద్ద పెద్ద భూస్వాములూ, లక్షాధికారులూ కూడా ఉన్నారు. అంతేకాదు. ఈ ఎన్నికల విషయంలో వారికి కావలసినంత పూర్వానుభవం ఉంది.

కేంద్రసభకు నా అభ్యర్ధిత్వం

నన్ను కృష్ణా గోదావరీ మండలాల నుంచి కేంద్ర శాసన సభకు అభ్యర్థిగా నిర్ణయించారు. నాకు ప్రత్యర్థి దివాన్ బహదూర్ మోచెర్ల రామచంద్రరావు పంతులుగారు. ఆయనకు మంచిపేరూ, పలుకుబడి ఉన్నాయి. అప్పటికి చాలా సంవత్సరాలుగా ఆయన కేంద్ర శాసన సభాసభ్యులుగా ఉంటున్నారు. ఆయన అజేయులనే కీర్తి వుంది. నా బాల్యమిత్రుడు, శ్రేయోభిలాషీ అయిన లేట్ సి. వి. ఎస్. నరసింహరాజుగారు అటు మోచర్లవారికీ ముఖ్య స్నేహితుడే. "రామచంద్రరావు పంతులుగారికున్న స్తోమతూ, పలుకుబడీ నీకు తెలియదు, ఆయనతో పోటీ యేమిటి నీవు? కట్టిన ధరావతు సొమ్ముకూడా నీవు కంటచూడజాల"వని నన్ను హెచ్చరించారు. నరసింహరాజూ, రామచంద్రరావుగారూ మితవాద కక్షకు చెందిన రాజకీయవేత్తలు. వారు ప్రజలలో ఈ సహకార నిరాకరణ ఉధ్యమం ఎటువంటి చైతన్యాన్ని కలిగించిందో, దేశంలో ప్రజా హృదయాన్ని కాంగ్రెసు ఏ విధంగా చూరగొందో గ్రహించలేదు. దేశీయులలో ఇటువంటి మహత్తరమైన మార్పు రావడానికి మొదటినుంచీ కాంగ్రెసువారు (నాయకులూ, సేవకులూ, అభిమానులూ) ఎటువంటి ప్రబోధంచేసి ప్రజాహృదయాన్ని ఆకర్షించి ఆకట్టుకో గలిగారో కదా! అక్షరాస్యులూ, నిరక్షరకుక్షులూ-ప్రజలందరూ విచక్షణ జ్ఞానంతో వ్యవహరించారు. దీర్ఘ కాలం పట్టినా, న్యాయమైన, సుస్థిరమయిన క్షేమాన్నే