పుట:Naajeevitayatrat021599mbp.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనడం ఆరంభించారు. కాగా, వారు కాంగ్రెసులో విలీనమవడానికి అవకాశం లభ్యమయి, వారి పార్టీ పేరును "కాంగ్రెసుపార్టీ"గా మార్చుటకు అంగీకరిస్తే, తాము అద్భుత ఫలితాలు చూపించగలమన్నారు.

గాంధీగారు విశ్రాంతిగా ఉండడమూ, కాంగ్రెసు స్వరాజ్యపార్టీ వారి అధీనంలో నడవడమూ జరుగుతున్నప్పుడు, "స్వరాజ్యపార్టీ"పేరు కాంగ్రెసు పార్టీగా మారడం సులభమే కదా! అందువలన గౌహతీ కాంగ్రెసుకు పూర్వమే స్వరాజ్యపార్టీ కాంగ్రెసుపార్టీ అయిపోయింది. ఈ మార్పు, 1926 నవంబరులో జరుగనున్న ఎన్నికలకు ముందుగానే, (పాట్నాలో జరిగిన) అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులో అంగీకరించబడింది.

1885లో కాంగ్రెసు సంస్థ ఏర్పడ్డాక అది ఎన్నికలలో పాల్గొనడం అన్నది అంతవరకు జరగని కారణంగా, ఈ 1926 నాటి ఎన్నికల సంరంభమే కాంగ్రెసు జీవితంలో మొట్టమొదటి దయింది. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ జరగడమూ, వాటిలో మొదటిసారిగా కాంగ్రెసు పాల్గొనడమూ అన్నది భారత చరిత్రలలో ఒక అపూర్వ ఘట్టం అయింది.

ఆంధ్రుల రాజకీయ చైతన్యం

ఆంధ్రులూ, ఆంధ్రదేశమూ కూడా 1920 నుంచీ, ఎటువంటి పరిస్థితికయినా తట్టుకుని నిలబడి, సరిఅయిన సూటి మార్గంలో నడవడానికి కావలసిన క్రమశిక్షణకు అలవాటుపడే ఉన్నారు. ఆంధ్రరాష్ట్రంలో జిల్లాలవారీగానూ, రాష్ట్రం మొత్తంమీదా కూడా పేరుపడ్డ సుప్రసిద్ధనాయకు లున్నారు. నాయకుల మాటకేం-ఉంటూనే ఉంటారు. ఏ దేశంలోనయినా రాజకీయంగా వచ్చిన విప్లవం జయప్రదం కాకావాలంటే ప్రజలలోనూ చైతన్యం రావాలి. ఉన్నత రాజకీయ చైతన్యం ప్రజలలోనూ, ప్రజాసేవకులలోనూ కూడా బాగా పాదుకోవాలి. అప్పుడే నాయకుల నాయకత్వం బాగా రాణిస్తుంది. అదృష్టవశాత్తూ అటువంటి చైతన్యం ఆంధ్ర ప్రజా హృదయాలలో బాగా నాటుకుంది.