పుట:Naajeevitayatrat021599mbp.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్కుతాయనే ఉద్దేశంతో ఈ గలాటాల వెనుక ఉండి ఉద్రేకాలు రెచ్చగొట్టి నాటక మాడారని తెలియ వచ్చింది.

బ్రిటిషువారు చేసిన తీరని ద్రోహం

ఈ లక్నో ఒడంబడిక ఆధారంగా కాంగ్రెసూ, ముస్లిం లీగూ కలిపి తయారు చేసిన స్వపరిపాలన ప్రణాళికే 1918 లో మాంటేగ్-ఛెల్మ్‌స్ఫర్డ్‌గార్లకు అందజేయబడ్డాయి. కాని అప్పట్లో ఆ సూచనలు తిరస్కరించబడ్డాయి. ఈ ఉమ్మడి ప్రతిపాదనలో జిన్నాగారి చెయ్యి కూడా ఉంది. ఈ ప్రతిపాదనలకు మాంటేగ్ త్రోసిపుచ్చిన కారణంగా లక్నో ఒప్పందాలు రద్దయి పోయాయనే సాకుతో, ఆ ఒడంబడిక సవ్య మయింది కాదు, అందులో మహమ్మదీయులకు ఉపకరించే షరతులు లేవనే ఆందోళన లేవతీయబడింది. సరళమైన సూటి మార్గాన్నే అవలంబించాలనే కొత్త నాయకుల విధానం పై విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. పైగా వారికి ఈ మితవాదుల ప్రాధేయ పూర్వక యాచనా విధానమూ నచ్చలేదు. ఇలాంటి పరిస్థితిలో, 1918లో, కాంగ్రెసు మితవాదుల చేతులనుండి అతివాదుల చేతులలోకి మారింది.

నిజంగా మాంటేగ్-ఛెల్మ్‌స్‌స్ఫర్డ్‌గారలు 1918లో ఆ ప్రతిపాదనలను అంగీకరించి, ఒక నూతన ప్రణాళికను రూపొందించి ఉంటే, ఈ దేశంలో ద్వంద్వ పరిపాలనకి స్థానం ఉండేది కాదు. హిందూ మహమ్మదీయ కలహాలూ చెలరేగేవి కావు. అంతేకాదు, అటుపిమ్మట సుమారు పాతిక సంవత్సరాలపాటు నడచిన హిందూ మహమ్మదీయ సంఘర్షణలలో ఏ పాపమూ ఎరగని నిరపరాధుల రక్తం ప్రవహించి ఉండేదికాదు. ఉభయవర్గాల వారూ సమర్పించిన ఆ ప్రతిపాదనలను 1917 నవంబరు మాసంలో మాంటేగ్ బృందం త్రోసిపుచ్చారు.

అవి భారతీయ రాజకీయాలలో గాంధీగారు తలదూరుస్తూన్న రోజులు. ఆయన కూడా ఎలాగయినా మాంటేగ్ ప్రభృతులచేతా, బ్రిటిషుగవర్నమెంటు వారిచేతా ఈ ప్రతిపాదనలను అంగీకరింప జేయాలని చాలా తంటాలుపడ్డారు. ఆయన ఈ కాంగ్రెస్-లీగ్ ప్రతి