పుట:Naajeevitayatrat021599mbp.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ ప్రాంతాలన్నీ అధిక సంఖ్యాకులయిన మహమ్మదీయుల ఆధిపత్యంలోవే. అలాంటి విషమ పరిస్థితులలో ఆ ప్రాంతాలలో హిందూ మహమ్మదీయ మైత్రిని గురించి ఉపన్యాసా లివ్వగలిగాం అంటే , అవకాశవాదులు రెచ్చకొట్టకుండా ఉండి ఉంటే హిందూ మహమ్మదీయ విభేదాలకీ, కొట్లాటలకూ తావు లేదనే అనవలసి వస్తుంది. చేజిక్కిన అవకాశాన్ని చిక్కబట్టుకుని, కాంగ్రెసు నాయకులే గనుక, ధనాన్ని పోగుజేసి బీదసాదలకూ బాధితులకూ పంచి పెట్టడానికి-ఒక్క పంజాబులోనే అన్నమాటేమిటి, ఇటు బెంగాలులోనూ, మహమ్మదీయులు ఉద్దతంగా ఉన్న యు.పి. మున్నగు రాష్ట్రాలలోనూ కూడా- అవసరమయిన ఏర్పాట్లుచేసి ఉద్యమాన్ని సక్రమంగా నడపగలిగి ఉంటే, హిందూ మహమ్మదీయ విభేదాల్ని మొగ్గ తొడక్కుండానే తుంచేసేవారం. ముల్తాన్ దుస్సంఘటనల కారణంగా, ఎన్నోప్రాంతాలు పర్యటించి, అక్కడి పరస్థితులు పరిశీలించి, సాధక బాధకాలను గ్రహించి ఒక బరువైన హృదయంతో మేము ఇండ్లకు చేరాం. గయా కాంగ్రెసు సమీపిస్తూన్న కొద్దీ, తమ తమ పక్షాలకే ప్రాముఖ్యం రావాలనే అత్రుతతో, నోఛేంజ్, ప్రోఛేంజ్ పార్టీలవారు తంటాలు పడుతూన్న రోజులవి. వీటిని గురించీ, గయా కాంగ్రెసు అంతర్నాటకాలను గురించీ లోగడ సుదీర్ఘంగా తెలియపరచే ఉన్నాను.

అవకాశవాదులు రేపిన అల్లర్లు

షహజాన్‌పూర్ కొట్లాటలను గురించి కాస్త విపులంగా యోచిద్దాం. వీనికి ముఖ్యకారణం లక్నో ఒడంబడికలకు మించిన, సదుపాయాలు తమకు కావలంటూ కొందరు మహమ్మదీయ నాయకులు లేవదీసిన ప్రచారమే. హిందువులు స్వతస్సిద్దంగా పిరికివారనీ, తాము గనుక అల్లర్లు లేవదీస్తే ఇతోధికంగా తమ కోర్కెల్ని మన్నించి తీరకయేం జేయగలరన్నదే అ మహమ్మదీయ నాయకుల విశ్వాసం. ముల్తాన్ ఉదంతం జరిగిన తర్వాత పంజాబులో సుహృద్భావం వృద్ధిగావడానికి కాంగ్రెసు వారు తగు చర్యలు తీసుకోలేదు గదా! అందువలన అ రెండు మతాలవారి మధ్యా పొగ రాజెయ్యడానికి, దుష్టశక్తుల్ని రేపడానికీ ఇదే