పుట:Naajeevitayatrat021599mbp.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన్నది మహమ్మదీయులకు వెన్నతోబెట్టిన విద్య అయింది. బ్రిటిషు రాజ్యాంగం వారు ఆ స్వల్ప విస్తీర్ణంగల సింధు ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించడం అన్నది నిజానికి అనుచితకార్యం. అది బొంబాయి రాష్ట్రంలో కలసి ఉన్నంతకాలమూ, హిందువులు ఆ ప్రాంతంలో అల్పసంఖ్యాకులే అయినా, వారికి అసంతృప్తులూ, బాధలూ అన్నవి అట్టే ఉండేవికావు.

మేము సింధులో ఉండగా అబ్దుల్లా హరూన్‌గారిని కలుసుకున్నాము. ఇప్పటిలా అప్పట్లో వారికి మతోన్మాదం లేదనే అనాలి. పరస్పరం అభిప్రాయాలు వెలిబుచ్చుకోడానికి మా సన్నివేశాలు ఎంతగానో ఉపకరించేవి. రాష్ట్రం మొత్తంమీద ఎక్కడకు మేము వెళ్ళినా మాకు హృదయపూర్వక స్వాగతాలే లభించేవి.

చేపలతో చెలికారం

మాకు ఒక నది ఒడ్డున నీటిని ఒరుసుకుని ఉన్న బంగాళాలో మకాం యిచ్చారు. ఆ నదీ తీరంలో ఒక అపురూప దృశ్యం మా కంట బడింది. నదిలోని చిన్న పెద్ద చేపలన్నీ మా చేతులలో ఉండే ఆహారాన్ని గ్రహించాయి. ఆ చేపలకి చాలా కాలంగా ఈ అలవా టుందిట!నదీ తీరానికేమిటి, ఒడ్డుమీదకు కూడా కొంతదూరం వచ్చి గబుక్కుని ఆహారాన్ని అందుకుని నీటిలోకి పోయేవి. కంటితో చూచిందాకా నమ్మడానికి వీలులేని దృశ్యం అది. ఆ ప్రాంతీయులు అంత అహింసాత్మకంగా ఆ చేపలతో సహజీవనం సాగించేవారని అన్నా అందులో ఈషణ్మాత్రమూ అసత్యం ఉండదు.

ప్రభుత్వంవారు అణగ ద్రొక్కాలనుకున్నా, నాయకులను జైళ్ళపాలు జేసినా కాంగ్రెసు గౌరవం మకుటాయమానంగా ఉంటూన్న రోజులవి. అందువలన మేము రాష్ట్రం అంతా తిరిగి హిందూ మహమ్మదీయ మైత్రి వలని లాభాలను గురించి ఉపన్యాసలిచ్చాం. హృదయ విదారకమయిన ముల్తాన్ ఉదంతాలు రేపిన హృదయ తాపం చల్లారకుండానే మాకు అ ప్రాంతాలన్ని తిరగ గలిగిన అవకాశం చిక్కింది.