పుట:Naajeevitayatrat021599mbp.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరిగి యిచ్చి వేస్తామని, నేనూ గోపాలశాస్త్రిగారూ ఉమ్మడిగా రాసి యిచ్చామనే అంశం పాఠక లోకానికి తెలుసు. మా ఉభయుల అభిప్రాయం అ పుచ్చుకున్న డబ్బు మా స్వంత ఉపయోగాలకు ఇవ్వబడింది కాదనీ, ఆ ధనాన్ని వాపసు యిచ్చే సందర్భంలో దానిని ధన రూపంగానే గాక వస్తు రూపంలో కూడా చెల్లించవచ్చుననీ, ఈ వ్యవహారమంతా, త్రివిధ బహిష్కార విధానం అమలులో నున్న రోజులలో జరిగింది. ఒక సాదా కాగితంమీద, పైన ఉదహరించిన షరతుల ప్రకారం, మేము ఒప్పందం రాసుకోవడం జరిగింది.

ఆ అఖిల భారత చరఖా సంఘ అధినేత శంకర్‌లాల్ బ్యాంకర్ గారికి ఒంగోలులోనూ, ఇంకా యితర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనూ ఈ ఖాదీ ఉధ్యమం విరమించాలనే అభిప్రాయం కలిగింది. ఆయన మాకు ఇచ్చిన పదివేలూ రొక్కం రూపంగా జమ కట్టవలసిందని తాఖీదు పంపించాడు. మేము ఆ ధనమంతా, చరఖాలమీద, మగ్గాలమీద, ప్రత్తి, నూలు వగైరాలమీదనే గాక తయారయిన బట్టమీద కూడా మదుపు పెట్టి ఉన్న కారణంచేత, అప్పు తీసుకున్న రొక్కాన్ని, రొక్కంగానే జమ కట్టమనడం భావ్యం కాదు గనుక, ఈ సంస్థని యావత్తూ ఒక నడుస్తూన్న సంస్థగా స్వాధీనం చేసుకుని, వారిచ్చిన డబ్బు క్రమేణా రాబట్టు కోవడం న్యాయమనీ, వారిచ్చిన పెట్టుబడి మేరకు సరుకు ఉన్నదో లేదో విలియా వేసుకోవచ్చుననీ, నష్టం అనేది ఏదయినా ఉంటే మేము భరించడానికి సంసిద్ధుల మేననీ విన్నవించాము.

చరఖా సంఘంవారి షైలాక్ వ్యవహారం

శంకర్‌లాల్ బ్యాంకర్‌గారు "షైలాక్"లాగ "అదేం కుదరదు, అనుకున్న ప్రకారం ఇవ్వవలసిన సేరు మాంసం ఇచ్చి తీరవలసిందే" అన్నారు. నేను కుదరదన్నాను.

ఈ విషయమంతా గాంధీగారి వద్దకు వెళ్ళింది. నేను అ. భా. చ. సంఘంవారిని ఎందుకు చికాకుల పాలుచేస్తున్నావో అర్థం కావడం