పుట:Naajeevitayatrat021599mbp.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదంటూ గాంధీగారు నా పేర ఒక ఉత్తరం వ్రాశారు. నేను ఉన్న పరిస్థితులన్నీ వారికి వివరించాను. ఈ విషయంలో వారికీ, మాకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. దక్షిణ ఆఫ్రికాలోని ఒక లక్షాధికారి, ఒక తగాయిదా పరిష్కారానికిగాను, తాను సూచించిన ప్రకారం, కోర్టు ప్రమేయం లేకుండా, ఏలా వందలూ, వేలూ కుమ్మరించాడో ఆ సంగతి ఉదహరిస్తూ, ఈ విషయంలో ఆఖరి ఉత్తరం గాంధీగారు వ్రాశారు.

ఆ ఉదంతానికీ, ఈ ఉదంతానికీ సంబంధం లేదనీ, పుచ్చుకున్న డబ్బుతో పెట్టవలసిన పెట్టుబడులన్నీ సవ్యంగానే పెట్టబడిన కారణంగా, ఆ వస్తువులన్నీ వారు స్వాధీనం చేసుకుని, ధన రూపంలోకి మార్చుకోమని కోరడములో, మేము న్యాయంగానే ప్రవర్తిస్తున్నామనీ, నష్టం యేమయినా ఉంటే ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నామనీ, తిరిగి ఇంకోసారి తెలియజేశాను. అంతేకాదు- మా అధీనంలో ఉన్న సమస్త వస్తు వాహనాదులన్నీ అ. భా. చ. సంఘంవారు ఆ పదివేల మింజుమలె జప్తుచేసి ఉన్న కారణంగా, వాటిని ఏ విధంగానూ అన్యాక్రాంతం చేయగల శక్తి మాకు ఉండదనీ సూచించాను.

గాంధీగారి సలహామీద దావా

గాంధీగారు ఈ విషయాలు నాతో ముఖస్థంగా చర్చించి ఉంటే, బహుశ:వారు కాదన లేకపోయే వారేమో! ఈ ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల నేను చికాకులు పెడుతున్నాననీ, సవ్యమయిన వ్యక్తిని కాదనీ భావించారో యేమో తెలియదుగాని, మాఉభయుల మీద దావా వేయ వలసిందిగా బ్యాంకర్‌గారికి సలహా ఇచ్చారు.

దాన్తో తీసుకున్న డబ్బు వాపసు యివ్వవలసిందంటూ, మా ఉభయులమీద బాపట్ల సబ్ కోర్ట్‌లో దావా వెయ్యబడింది. నేను మా స్టేట్ మెంట్‌లో, న్యాయబద్దమైన అన్ని సూచనలూ చేస్తూ, కాంగ్రెసువారు, త్రివిధ బహిష్కార విధానం అమలు పరుస్తూన్న రోజులలో ఈ వ్యవహార కాండ అంతా నడచిన కారణంగా, ఆ కోర్టువారికి ఇట్టి దావాలను