పుట:Naajeevitayatrat021599mbp.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవితంలోనూ అర్థమయ్యాయి. కాని, దురదృష్టవశాత్తూ ఇంకా మత సాంఘిక రాజకీయ స్వాతంత్య్రాలు మనకు లభించలేదు. దానికి కారణం మనకు సరి అయిన పద్ధతులమీద శిక్షణ లేకపోవడమే. మన వాంఛలూ, కోరికలూ, మనల్ని ఇంకా పీడిస్తున్నాయి. పోటా పోటీలమీద, లాభసాటి వ్యాపారాల మీదా, ధనార్జన మీదా వ్యామోహాలు తగ్గలేదు. రాజకీయాలతో సహా, ఏ రంగంలో ప్రవేశించినా, ఏ పని చేద్దాం అన్నా, లాభాలమీద లాభాలు గణించాలనే వాంఛ చావలేదు.

ముంచుకు వచ్చిన పరిస్థితులు

"స్వరాజ్య" పత్రికను గురించి వివరించబోయే ప్రకరణమున్నూ చాలా మనోరంజకంగానే ఉంటుంది. దురదృష్ట వశాత్తూ, హైకోర్టు జడ్జీగారి తీర్పు ప్రకారం ఆ సంస్థను మూసివేసే వరకూ వ్రాసిన విషయాలు చదువరుల హృదయాలకు బాగా హత్తుకుంటాయి. హైకోర్టులో నాపైన తేబడిన ఒక "సమ్మరీ పిటీషన్" మీద ఇవ్వబడిన తీర్పు కారణంగా పత్రిక విరమింపవలసి వచ్చింది. ఆ గాథంతా వేరే ప్రకరణంలో వివరంగా తెలియజేశాను. నా శత్రువులు దుర్బుద్దితో పన్నిన కుట్ర కారణంగా పత్రిక మట్టుపెట్టబడిన వైనం పూర్తిగా ఆ ప్రకరణంలో వివరించాను. ఆ వివరణ అంతా సరిగానూ, సవ్యంగానూ చేశాననే నా భావన.

ఒక ప్రఖ్యాత నాయకునిగా, ఒక సన్నిహిత మిత్రునిగా గాంధీగారు 1922 లోనూ, 1924 లోనూ కూడా పత్రికను విరమించమని సలహా ఇచ్చి ఉన్నారు. నేను పత్రికను ఆపుచేయడానికి అంగీకరించని కారణంగా, వారికీ నాకూ మధ్య స్వల్పమయిన అభిప్రాయభేధా లేర్పడి, మాకు ఉన్న పూర్వపు సన్నిహిత్యానికి అవరోధాలు కన్పించాయి. ఈ సందర్భంలో గాంధీగారికీ, నాకూ మధ్య నడచిన ఒక ఉపాఖ్యానం చెప్పడం న్యాయము.

బాపట్ల కోర్టులో దావా కధ

ఒంగోలు తాలూకాలో ఖాదీ ఉధ్యమాన్ని సక్రమంగా నడుపుటకు అఖిల భారత చరఖా సంఘం వారిచ్చిన పెట్టుబడి పదివేలూ వారికి