పుట:Naajeevitayatrat021599mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంది. కరువు రోజుల్లో ఆహారం తక్కువైనపుడు మా మేనత్త గారు ఆకుకూరలు ఎక్కువగా సంగ్రహంచి అన్నం కన్న ఆకుకూరలు ఎక్కువగా పెట్టడం కూడా నాకు జ్ఞాపకం వుంది.

నాకు 5 ఏళ్ళు వచ్చేవరకూ మా నాయనగారు అతి కష్టంగా కాలక్షేపం చేశారు. ఈ కాలంలోనే నా అప్పగార్ల వివాహాలు, నాకు ఉపనయనమూ కూడా చేశారు. ఉపనయనం నాటికి నాకింకా 5 ఏళ్ళు పూర్తికానట్టు మా అమ్మగారు చెప్పింది. నాకు ఇంచుమించుగా 5 ఏళ్ళు వెళ్ళగానే ఉపనయనం చేసినట్లు ఆమె చెప్పింది. ఉపనయనం విషయంలో నాకు జ్ఞాపకం ఉన్న దల్లా అరుగుమీద కూర్చోబెట్టి సంధ్యావందనం చెప్పడం! మా పురోహితులైన పిల్లుట్ల చెంచయ్య గారు ఎంతో కష్టం మీద నన్ను అరుగుమీద కూర్చోబెట్టి సంధ్యావందనం చెప్పేవారు.

ఇక అప్పటి చదువు విషయం. నా అక్షరాభ్యాసం వల్లూరులో వెంకటప్పయ్య అనే ఆయన వీధి బడిలో. ఆయన నాకు ఓనమాలు నేర్పిన ఆది గురువు. ఆయన విద్యే నాకు మొదటి పునాది రాయి. అయితే, ఆయన శుశ్రూషవల్ల ఇప్పటికీ నాకు వున్నవి ఆనాటి తొడపాయసాలు! ఆయన చదవకపోతే చర్మం వూడి చేతుల్లోకి వచ్చేటట్లు పట్టేవాడు! అంతే కాకుండా, నన్ను బడికి పంపడానికి మావాళ్ళు పడిన పాట్లు కూడా నాకు కొంచెం జ్ఞాపకం ఉన్నాయి. చేతులూ కాళ్ళూ కట్టి ఈడ్చుకువెళ్ళి బడిలో వెయ్యడమూ, నేను ఆ బంధనాలు తెంచుకోవడమూ కూడా నాకు కొంచెం జ్ఞాపకం! నా వీధిబడి చదువు వల్లూరులో కొంతవరకు అయిన తరువాత కుటుంబ నిర్వహణం కోసం మా నాయన గారు వేరొక గ్రామానికి మారదలచుకొని నన్ను అద్దంకి గ్రామంలో మా పెద్దబావగారైన పోరూరి నరసింహంగారి వద్ద అప్పచెప్పారు.

ఆయన ఆ గ్రామలో వీధిబడి నడుపుకుంటూ, గౌరవంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఆ బ్రాహ్మడు నాకు పునాదికట్టుదిట్టంగా చదువు చెప్పాడు. కాని, ఆ చదువుకోసం ఆయన నాతో పడ్డ బాధ నాకు తెలియాలి; ఆ పరమేశ్వరుడికి తెలియాలి! అల్లా నన్ను పెద్ద అల్లుడిదగ్గిర