పుట:Naajeevitayatrat021599mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదువుకి అప్పజెప్పి మా నాయన గారు వెంకటగిరి సంస్థానంలో ఉద్యోగ సంపాదన కోసం వెళ్ళారు. ఆయన అక్కడ ఎందరో ప్రముఖుల్ని ఆశ్రయించి చిట్టచివరికి నాయుడుపేట దగ్గిర సువర్ణముఖి నది ఒడ్డున మేనకూరు ఒంటు పారుపత్యందారు ఉద్యోగం సంపాదించారు. పారుపత్యం దారు అంటే ఈ రోజుల్లో సముద్దారు అన్నమాట. ఆ రోజుల్లో ఆయన జీతం ఎనిమిది రూపాయలు. ఆయన, కుటుంబం వల్లూరులో ఒదిలివేసి, రెండు సంవత్సరాలపాటు ఆ ఊళ్ళో కష్టపడి ఉద్యోగం చేశారు.

రెండు సంవత్సరాలు అయిన తరువాత కుటుంబం నాయుడుపేట పంపించారు. అప్పటికే అద్దంకిలో నా వీధిబడి చదువై పోయి ఇంగ్లీషు చదువు ప్రారంభానికి నాయుడుపేట చేరాను. అప్పటికే నాయుడుపేటలో ఒక ఇంగ్లీషుస్కూలు ఉండింది. మా తమ్ముడు శ్రీరాములు, నేనూ ఆ స్కూల్లో చేరాము. మా నాయనగారు మా చదువుకోసం నాయుడుపేటలో ఉండి, మేనకూరు మొదలైన గ్రామాల పని చూస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో రెవిన్యూ వసూళ్ళు ధాన్యాదుల్లోనే జరుగుతూ ఉండేవి. నేను మా నాయనగారితో అప్పుడప్పుడు గ్రామాల్లోకి వెడుతూ ఉండడం కూడా జరిగేది. అల్లాంటపుడు రైతులు పిల్లవాడు వచ్చాడని మెహనతుగా రూపాయీ, అర్ధా బహుమతిగా ఇచ్చేవారు. నేను అవి అన్నీ ఒక డబ్బాలో జాగ్రత్తపెడుతూ ఉండేవాణ్ణి. పెద్ద పెద్ద దస్తరాల ముందుకూర్చోబెట్టి ఆయన అప్పుడప్పుడూ నాచేత లెఖ్ఖలు కూడా వ్రాయిస్తూ ఉండేవారు.

అప్పట్లో వెంకటగిరి సంస్థానం గురించి కొంచెం వ్రాస్తాను. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానం ఉత్తరఖండం, దక్షిణఖండం అని రెండుభాగాలుగా ఉండేది. ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క పేష్కారు అధిపతి. పేష్కారు కింద అమల్‌దారు అని 30 రూపాయల ఉద్యోగి ఉండేవాడు. ఆయన కింద మా నాయనగారు పారుపత్యందారు ఉద్యోగం చేసేవారు. ఈ సంస్థానంలో అప్పటికే తక్కువజీతాలు, లంచగొండితనం, ఆశ్రయింపులు, వుద్యోగం నిలకడ లేకపోవడం,