ఏవిధమైన ఆధారాలు, - అంటే జాతకం వగైరాలు లేవు. నేను పుట్టినపుడు మా నాయనగారు నా జాతకం వ్రాయించినట్లు తెలిసింది. కానీ, నాకు జ్ఞాపకం వచ్చి నేను దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేసరికి జాతకం వ్రాసిన దైవజ్ఞుడు పిల్లుట్ల పిచ్చయ్యగారు మరణించడం చేతను, మేము దేశాంతరాలు పట్టి ఉండడంచేతనూ అవి లభ్యమయింది కాదు. తరవాత, నా పుట్టిన తేదీ అవసరమైనప్పుడు మా అమ్మగారితో సంప్రదించగా నిర్ధారణయిన సంవత్సరం 1872. ఆ సంవత్సరం సరి అయినదే అనడానికి తరవాత అనేక నిదర్శనాలు కనిపించాయి.
అప్పటికి మా ఇద్దరు అక్కగార్లకి కొంచెం ఆదాయం వచ్చింది. వాళ్ళిద్దరికీ వయస్సు తేడా నాలుగు సంవత్సరాలు. నాకూ మా రెండో అక్కగారికీ వయస్సు తేడా నాలుగు సంవత్సరాలు. అంతే కాకుండా, మా అన్నదమ్ములకీ, అక్క చెల్లెళ్ళకీ ఒక్కొక్కరికి మధ్య వయస్సు తేడా సరిగ్గా నాలుగు సంవత్సరాలు. నాకు సుమారు నాలుగైదు సంవత్సరాల వయస్సుండగా ధాత సంవత్సరం నాటి దారుణకాటకం వచ్చింది. ఆ కరువు సంగతి నాకు బాగా తెలుసును. అప్పటికి మా అక్కగార్లిద్దరికి జరిగిన వివాహాలు నేనెరుగుదును. అందుచేత 1872వ సంవత్సరమే నా స్థిరమైన జన్మ సంవత్సరంగా నిర్ధారణ చేసుకోవచ్చును.
నేను 1872వ సంవత్సరంలో కనపర్తి గ్రామంలో మా మేనమామల ఇంట్లో జన్మించాను. నేను పుట్టిన తరవాత ఒక సంవత్సరం పాటు అక్కడే ఉండి, వల్లూరు వచ్చినట్లు మా అమ్మగారి వల్ల వినికిడి. నేను పుట్టిన రెండు మూడు సంవత్సరాలకి దేశంలో అనావృష్టి అధికమై మా నాయనగారికి వల్లూరు భూముల వల్ల వచ్చే ఆదాయంలో కుటుంబపోషణ దుస్తరం అనిపించింది. దానివెంట ధాత సంవత్సరపు కరువు. ఇక చెప్పేదేముంది? ఆయనకి ఇంకొక ఉపజీవనం సంపాదించాలనే సంకల్పం కలిగింది. ఆ రోజుల్లో మా నాయనగారితోనూ, మా పెద్ద మేనత్తగారితోనూ ఆ పొలాల్లో తిరుగులాడడం నాకిప్పటికీ జ్ఞాపకం