పుట:Naajeevitayatrat021599mbp.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీర్మాన రూపంగా ప్రవేశ పెట్టనున్నాననీ చెప్పేవరకూ తెరవెనుక ఎంత గ్రంథం నడిచిందో అవగాహన చేసుకోలేకపోయాను.

నా రాజీనామా

కార్యనిర్వాహకవర్గ సభ్యులను ఎవ్వరినీ ముందుగా కలుసుకోకుండా, రాజగోపాలాచారిగారు అటువంటి ప్రతిపాదన ప్రవేశ పెట్టడానికి అంగీకరించడం నాకు చాలా విచార హేతువే అయింది. త్రివిధ బహిష్కార కార్యక్రమం వాయిదా వెయ్యాలన్న ప్రతిపాదనలో గర్భితమై ఉన్న అపాయాన్ని సూచించాను. కీడు మేళ్ళు బేరీజులేస్తూ విషయాన్ని వివరించిన నా శ్రమ అంతా రాజగోపాలాచారిగారి విషయంలో బూడిదలో పోసిన పన్నీరే అయింది. దాస్-మోతిలాల్‌గార్లు పన్నిన వలలో ఇరుక్కున్నారన్నాను. ఎంతో తెలివిగా వారు త్రవ్విన గోతిలోకి అనుకోకుండా నవ్వుతూ వెడుతున్నారన్నాను. దిగగొట్టడానికి వీలుగా మలచబడిన సీలయొక్క మొన-వారి వాదన, అన్నాను. రెండు మాసాల విరమణ అన్నది శాశ్వత విరమణకే ప్రాతిపదికా, నాందీ అన్నాను. నా వాదన అంతా కంఠశోషే అయింది. ఆయన చాలా మొండిగా తయారయాడు. జరిగే ప్రతి సమావేశ సారాంశం, తీర్మానాలు వ్రాసే రికార్డు పుస్తకం (మినిట్స్ బుక్)లో ఈ మాటే వ్రాసి, నా సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాను.

తరువాత, అ.భా.కాం.సం. సమావేశంలో ప్రత్యర్థుల ప్రతపాదనను ప్రవేశపెట్టే గౌరవం రాజగోపాలాచారిగారు దక్కించుకున్నారు. దాస్-మోతిలాల్ గారలు ఆ ప్రతిపాదనను బలపరిచారు. కొన్ని నిమిషాలలో అది సభవారి ఆమోదాన్ని పొంది, తీర్మానమే అయిపోయింది. నిజానికి అది గాంధీగారి కార్యక్రమ నాశనానికి నాందే అయింది.[1]

  1. ఈ సమావేశంలో ఏప్రిల్ 30 వ తేదీవరకు ఉభయ పక్షాలవారు శాసన సభా ప్రవేశాన్ని గురించి ప్రచారం నిలిపి వేసెటట్టుగా "తాత్కాలిక సంధి" కుదిరింది. ఈ రాజీ కుదిర్చినవారు మౌలానా అబుల్ కలాం అజాద్, పండిత జవహర్ లాల్ నెహ్రూ. ఈ సభనాటికి వారు జైలునుంచి విడుదలయారు.