పుట:Naajeevitayatrat021599mbp.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజానికి దాస్-మోతిలాల్‌గార్లు చాలా ప్రజ్ఞావంతులు గనుకనే, మరుసటి నెల తిరక్కుండానే రాజగోపాలాచారిగారిని తమ ప్రక్కకు త్రిప్పి వేసుకుని, రెండు మాసాలపాటు త్రివిధ బహిష్కార ప్రచార విరమణకు, రెండవ కంటివానికి తెలియకుండా, సుముఖుణ్ణి చేసుకోగలిగారు. ఈ లోపున తాము దేశాన్నిచుట్టి, తమ ప్రచారాన్ని సాగించి దేశీయులను తమ ఉద్దేశాల కనుగుణంగా త్రిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని వారు ఆశించారు. రెండు మాసముల వ్యవధిలో తమ ప్రచార బలంతో ప్రజలను తమ పక్షానికి త్రిప్పుకుని తమ వాదనలో ఉండేశక్తినీ, సత్యాన్నీ ప్రజల ముందు పెట్టలేకపోతే, తాము మనస్ఫూర్తిగా సహకార నిరాకరణ ఉద్యమానికే తమ శక్తిని ధారపోసి, గయా కాంగ్రెసువారు పున:పరిశీలనానంతరం అమలుపరచ నిశ్చయించుకున్న త్రివిధ బహిష్కార కార్యక్రమంతోటీ, గాంధీగారి రాజకీయ విధానం తోటీ సహకరించగలమని వారు ఒప్పందానికి రాగా, ఆచారిగారు 1-1-1923 నాటి తమ సుముఖ భావాన్ని 27-2-1923 నాటికి సులభంగా మార్చుకో గలిగారు. ఈ పెద్దమనిషి రెండు మాసాలలో మునిగిపోయేదేముందనే ధీమాతో, ఆ నాయకులకు ఆ అవకాశం కలిగించారు. పిబ్రవరి 27 వ తేదీని అలహాబాదులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు జరిగే ముందు, కార్యనిర్వాహకవర్గం సమావేశమైంది. ఆ మీటింగుకు రాజగోపాలాచారిగారు ఆలస్యంగా వచ్చారు. ప్రవేశపెట్టబోయే తీర్మానం విషయంలో అభిప్రాయభేదాలు లేకుండా ఉండడానికి, పున:పరిశీలనార్థం దాస్-మోతిలాల్‌గార్లతో రాజగోపాలాచారిగారిని జతపరచడాన్ని పురస్కరించుకుని దాస్‌గారు, మోతీలాల్ గారు తమ పొగడ్తల ద్వారా త్రివిధ బహిష్కార కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించాలనే తీర్మానాన్ని రాజగోపాలాచారిగారే ప్రతిపాదించేటట్లుగా చేయగలిగారు. ఈ తెరవెనుక భాగవతం నా కేమాత్రము తెలియనివ్వలేదు. రాజగోపాలాచారిగారు వచ్చి సభలో పాల్గొంటూ, తమకూ ప్రత్యర్థులకూ ఒక విధంగా రాజీ కుదిరందనీ, దానిమీదట రెండు మాసాలుపాటు త్రివిధ బహిష్కార కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ప్రతిపాదన తానే మహాసభలో