గోపాలకృష్ణయ్య. ఆయన మాంచి స్పురద్రూపి, సత్యసంధుడూ, విద్వాంసుడూ కూడాను. ఆయన ఎడింబరో విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం ముగించుకుని వచ్చిన తరువాత కొంతకాలం రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ ట్రెయినింగ్ కాలేజిలో ఆచార్యుడుగా ఉండేవాడు.
ఈయన చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి. అచ్చటి ప్రిన్సిపాల్ ఆర్.డబ్ల్యు. రాస్ దొరగారు చూపించిన నిరంకుశత్వానికి నిరసనగా తమ ఆచార్య పదవికి స్వస్తిచెప్పి, బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత పదవీ పరిత్యాగం చేసి దేశమాత పిలుపును ఆకర్షించి, ఆమె సేవలో నిమగ్నుడయ్యాడు. చీరాల దూరతీరాలలోని ఇసుక పర్రలలో రామనగర గ్రామ నిర్మాణానికి పూనుకున్నాడు.
విచిత్ర యుద్దం
అసలు విషయం యేమిటంటే ఆ 1921 వ సంవత్సరంలో పానగలు రాజాగారి జస్టిస్‌పార్టి వర్గానికి, చీరాల ప్రజలకూ మధ్య పెద్ద యుద్ధమే ప్రారంభం అయింది. చీరాల-పేరాల పంచాయతీ యూనియన్‌ని పురపాలక సంఘంగా మార్చాలని మంత్రివర్గంవారి పట్టుదల. గోపాల కృష్ణయ్యగారి ఆధ్వర్య వాన దానిని పురపాలక సంఘంగా రూపొందించకుండా, ఎప్పటిలా యూనియన్ గానే ఉండనియ్యమని ప్రజలకోరిక. ప్రజల కోరికను మంత్రి మండలివారు మన్నించక పోవడంతో, ప్రజలకూ మంత్రివర్గం వారికీ మధ్య ఒక రకమయిన యుద్దమే ఆరంభం అయింది.
ఇది చాలా విచిత్రమయిన యుద్దం. ఆంధ్రరత్న ప్రజలందరినీ కూడ గట్టుకొని, చీరాల ప్రాంతాన్ని మునిసిపాలిటీగా రూపొందిస్తే, ఆగ్రామాన్ని పూర్తిగా విసర్జించి, వేరే తావులకు వలసగా వెడలి పోతామని తెలియజేశాడు. ఇది నిజంగా చాలా బ్రహ్మాండమయిన ప్రయత్నం. చీరాల-పేరాల ప్రజలు పదిహేడువేల మందికి పైగా ఉన్నారు. వారందరినీ ఒకే త్రాటిమీద నిలబెట్టి, వారిచేత తరతరాలుగా వారు వుంటూ