క్లిష్ట సమయంలో గుంటూరులో ప్రారంభింపబడిన యీ పన్నుల నిరాకరణ ఉద్యమం గాంధీగారి అభిప్రాయానికి భిన్నంగా ఆరంభింప బడ్డది అంటూ డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిచే వ్రాయబడిన ఉత్తరం ఒకటి "జన్మభూమి" పత్రిక ప్రచురించింది. దరిమిలా "సర్" కూడా అయిన థామస్ రూథర్ ఫర్డ్ యీ "జన్మభూమి" ప్రతులను విరివిగా కొని, జిల్లా కేంద్ర స్థానాలలో పెక్కుచోట్ల తానే స్వయంగా ఆ కాపీలను పంచిపెట్టడం ఆరంభించాడు.
ఈ పరిస్థితుల నన్నింటిని గమనించే మేము ఉద్యమ విరమణకి సలహా యిచ్చాం. మా ఉపసంఘపు రిపోర్టు ఆధారంగా, ప్రదేశ కాంగ్రెసువారు ఉద్యమాన్ని విరమించి పన్నులను ఇచ్చివేయవలసిన దంటూ ఆదేశించారు. అంతే, వారం రోజులు తిరక్కుండానే కొన్ని లక్షల రూపాయలు పన్నుల రూపేణా పూర్తిగా ట్రజరీలలో జమ కట్ట బడింది.
ప్రభుత్వానికి కనువిప్పు
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉద్యమం ద్రవించి స్రవించి పోయినా, పరిపాలకులకు మాత్రం అది ఒక కనువిప్పే అయింది. ఈ ఉద్యమం సాగింది నాలుగు మాసాలే అయినా, అ నాలుగు మాసాలలోనే , అనాటి గవర్నర్ విల్లింగ్‌డన్ గారికీ, వై స్రాయిగారికీ, బ్రిటిషు కాబినెట్ వారికికూడా పన్నుల నిరాకరణ అన్నది ఎటువంటి పరిణామాలను కలుగజేస్తుందో అర్థం అయింది. ఉద్యోగ విరమణ అనంతరం లార్డ్ విల్లింగ్‌డన్ రెండుమూడు సందర్భాలలో, గుంటూరు పన్నుల నిరాకరణ ఉద్యమం యేవిధంగా బ్రిటిషు రాజ్యాంగం విధానాన్ని పునాదులతో సహా కదలించి వేసిందో పబ్లిక్‌గా ఉద్ఘాటించారు.
ప్రభుత్వం వారి క్రూరాతి క్రూర విధానాలతో ప్రజానీకం నైతికంగా పతనం కాకముందే మేము తీసుకున్న చర్య సాఫల్యాన్ని సాధించినా, తిరిగి ప్రజలలో శాంతి భద్రతలు నెలకొల్పబడే పర్యంతమూ మేము ఎంతో ఆత్రుతతో సంచరించాము. ఉద్యమం అప్పట్లో విర