కలసి జిల్లా అంతా పర్యటించి ఉద్యమం సాగించడం విషయమై మా అభిప్రాయాన్ని వెల్లడించాము.
ప్రభుత్వపు ఒత్తిడితో ప్రజలలో నైతిక పతనం ఆరంభం అయింది. మిలటరీవారు ప్రజలను పలువిధ హింసా కాండలకు లోనుజేశారు అని వ్రాస్తూ మన ప్రాంతం గురించి, మన మిర్చి పంట గురించి, మా జీవితంలో మొట్టమొదటిసారిగా జూచిన "టామీ"లో వింత ప్రవర్తన గురించికూడా వ్రాయకుండా ఉండలేకపోయాము. అధికారులుగా వచ్చిన ఆంగ్లేయులకు మిరప పండ్లన్నవి మామూలుగా తినే పండ్లు కావన్న సంగతి కూడా తెలియదు. ఒకసారి వారంతా ఒక పండిన మిరపచేలోపడి, మనోహరంగా ఎర్రగా పండిన ఆ మిరప పండ్లను తినాలనే ఆతురతకొద్దీ, ఒకచేలోపడి చేతుల నిండుగా మిరప పళ్ళను కోసుకుని గబగబా నోళ్ళల్లో క్రుక్కుకున్నారు. కొద్ది క్షణాలలోనే నాలుకలు పీక్కుంటూ బాధా నివారణార్థం మురికి గుంటలలోని నీళ్లని కూడా త్రాగడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి ముక్కూ మొహమూ ఎరుగని బ్రిటిషు సోల్జర్ల చేతులలో మన దేశీయుల మంచీ, మర్యాదలు ఎల్లా నిలవగలుగుతాయి? ఈ సందర్బంలో మిలటరీవారు, పోలీసువారు చేసిన దుండగాలు వివరంగా వర్ణించడం అననసరం. కర్షకుల స్థితి అధోగతి పాలయిందన్న ఒక్కముక్క చాలు. వారు యీ పరిస్థితిని తట్టుకోలేకపోయారు.
విరమణకు మా సలహా
ఉద్యమం ఒక్క వంద గ్రామాలలోనే ప్రారంభింపబడ్డా జిల్లా మొత్తం అంతా సానుభూతితో పెద్ద యెత్తున హర్తాల్ ఆరంభం అయింది. నాలుగు మాసాలు దాటినా జిల్లా మొత్తంమీద నాలుగు పైసాలయినా పన్నుల రూపంగా వసూలు కాలేదు. ఉద్యమం ఇంకా సాగిస్తే ప్రజలు ఈ పరిస్థితులకు తట్టుకోవడం దుస్సహం అవుతుందనే భావనతో జిల్లా అంతా పర్యటించిన నేనూ, నాగేశ్వరరావు పంతులుగారూ కూడా ఉద్యమాన్ని విరమించడమే మంచిదని సూచించాము.