Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనే అహంభావంతో, ఆదిలోనే వారితో భేదాభిప్రాయం కలిగివున్నారు. నాగపూరు కాంగ్రెసు[1]లో ప్రతపాదింపబడిన అహింసాత్మక సహకార నిరాకరణోద్యమ తీర్మానం అత్యధికమైన మెజారిటీతో ఆమోదింపబడి, గాంధీగారి కార్యక్రమానికి ప్రోత్సాహం లభించిన కారణంగా చిత్తరంజన్ దాసుగారు తప్పనిసరిగా దానికి తల ఒగ్గవలసి వచ్చింది. తన కుమారుడే గాంధీగారి ప్రథమ శిష్యుడయిన కారణంగా, మోతిలాల్ నెహ్రూగారుకూడా గాంధీగారి విధానాన్ని శిరసావహించవలసి వచ్చింది.

అందువలన దాస్, మోతిలాల్‌గార్లకు సహకార నిరాకరణోద్యమంపట్ల గాంధీగారికున్నంత విశ్వాసం లేదన్న విషయం విశదం అవుతూనేవుంది. గాంధీగారి "పిలుపు" ను అనుసరించి, ప్రాక్టీసు విరమించి ఉద్యమంలో చేరేనాటికి దాస్, మోతిలాల్‌గారలు తమతమ రాష్ట్రాలలో చాలా ఉన్నతస్థాయిలో న్యాయవాదవృత్తి సాగించేవారు. అటువంటి ప్రముఖులే వృత్తులు విడచి, ఉద్యమంలో చేరి జైళ్ళకు వెళ్ళడానికి సిద్ధమవడంచేత, వందలాది వారికి అనుచరులై నారు. గాంధీగారి పిలుపును అనుసరించే ఉద్యమంలో చేరినవారైనా, వారి హృదయాలలో గాంధీగారి విధానాలపట్ల ఏదో ధర్మసందేహం లాంటిది పీకుతూ వుండడంచేతనే వా రిరువురూకూడా గాంధీగారి కార్యక్రమంలో పూర్తి విశ్వాసం ఉంచలేకపోయారు.

లక్నో ఒప్పందం

స్వాతంత్ర్య సమరదీక్షనూ, సహకారనిరాకరణ విధానాన్నీ అవలంబించకపూర్వం కాంగ్రెసు నాయకులుగా ఉండేవారి కందరికీ గవర్నమెంటువారు మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వడం అప్పుడు ఆచారంగా ఉండడంవల్ల, నూతనంగా కాంగ్రెసులో చేరినవారి దృష్టి, ఇటు ఆత్మార్పణతో కూడుకున్న అహింసాత్మక ఉద్యమవిధానం మీదనే కాక,అటు ఉద్యోగాన్వేషణమీద కూడా ఉండేదన్న విషయం మరువకూడదు. 1916 లో లక్నో కాంగ్రెసులో ఆమోదింపబడిన కాంగ్రెసు-ముస్లిం లీగ్ ఒప్పందమనే హిందూ మహమ్మదీయ సామరస్యపు బీజం దేశరాజకీయ

  1. 1920 లో జరిగినది.