అధ్యక్షుడుగా ఆయన చదవవలసిన ఉపన్యాసాన్ని శ్రీమతి సరోజనీదేవి చదివింది. దాస్‌గారి స్థానంలో వారి ప్రతినిధిగా డిల్లీ నివాసి అయిన హకీం అజ్మల్ ఖాన్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు.
త్రివిధ బహిష్కారం
కాంగ్రెసు బ్రహ్మాండంగా జరిగింది. ప్లీడర్లను తమ వృత్తిని విరమించమన్నారు. శాసన సభా సభ్యులను రాజీనామా లిచ్చి బైటికి రమ్మన్నారు. విద్యార్థులను కళాశాలల నుంచీ, పాఠశాలల నుంచీ వెలుపలికి రమ్మన్నారు. ఈ పోరాటపు దినాలలో అర్జన లేక బాధపడే ప్లీడర్ల సహాయార్థం సేట్ జమన్ లాల్ బజాజుగారు లక్షరూపాయలు విరాళంగా ఇచ్చారు. బ్రహ్మాండమయిన ఈ త్రివిధ బహిష్కరణ కార్యక్రమం సరిగా అమలు జరిగినట్టయితే సర్వాజ్యాన్ని సాధించడానికి పండ్రెండు మాసాలు చాలని నిర్దరించినా, ఈ లోపునే వచ్చి తీరుతుందనే గట్టి నమ్మకం అందరి హృదయాలలోనూ సుస్థిరం అయింది. నిజానికి స్కూళ్ళూ, కాలేజీలూ ఇంకా కొన్ని సంవత్సరాలపాటు బహిష్కరింప బడివుంటే అనుకున్న దానికంటె ముందుగానే స్వరాజ్యం వచ్చి ఉండేది.
వృత్తిని మాని జైళ్ళకువెళ్ళిన ప్లీడర్ల దీక్షను, దేశవ్యాప్తంగా జనబాహుళ్యం కనబరచిన త్యాగశీలతను నిశితంగా పరిశీలిస్తే ఈ సంఘటన లన్నీ ప్రపంచ చరిత్రలోనే నిరుపమానమయినవని, ఒప్పుకోవలసి ఉంటుంది. పోరాటంలో పాల్గొన్న జనసమూహమే కాదు, పోరాటం జరుగుతున్న విధాన్ని గమనిస్తూ ఉన్న ప్రతి వ్యక్తీ తర తమ బేదాలూ, కుల మత తారతమ్యాలూ విస్మరించి తామంతా సంపూర్ణమయిన , సమగ్రమయిన స్వరాజ్యాన్నే సాదించి తీరుతామనే నిశ్చయంతో ఉన్నారు. లక్షలాది ప్రజలలో నాటుకుపోయిన ఈ భావానికీ, వారిలో కలిగిన రాజకీయ చైతన్యానికీ ఆనాటి వైస్రాయి "లార్డ్ రీడింగ్" (Lord Reading) *[1]విస్తుపోయాడు. విస్తుపోవడ మేమిటి. చైతన్య హీనుడే అయ్యాడని అనవలసి ఉంటుంది.
- ↑ *రీడింగు ప్రభువు 1921 ఏప్రిల్ లో వైస్రాయిగా వచ్చాడు.