Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదీ లేదని నిశ్చయించుకున్నాం. పన్నుల నిరాకరణ ఉద్యమం పట్ల అప్పట్లో మాకువున్న అభిప్రాయా లలాంటివి.

2

అహమ్మదాబాదు కాంగ్రెస్: వింతలు విశేషాలు

అహమ్మదాబాదు (గుజరాతు) లో కాంగ్రెసు [1] పేరిట మేము కలిసే ముందు గాంధీగారు ఆ కాంగ్రెసు చాలా నిరాడంబరంగా జరుగుతుందనీ, గత సంవత్సరాలలో జరిగినట్లు దుబారా ఖర్చులుగాని, అధిక వ్యయాలుగాని ఉండవనీ, ఏటేటా ప్రతినిధులు కూర్చోడానికే బెంచీలకూ కుర్చీలకూ అయ్యే ఖర్చుల క్రిందే కొన్ని వేలు వ్యయం అయ్యేదనీ, అట్టి దుబారాలేవీ లేకుండా ప్రతినిధులందరూ నేలమీదే సుఖాసీనులయి కార్యకలాపాలలో పాల్గొంటారని వ్యక్తపరిచారు. అధిక వ్యయం తగ్గించి, ఆడంబరం విడిచిపెట్టి, నిరాడంబరంగా జీవించే విధానానికి అహమ్మదాబాదు కాంగ్రెసు నాంది అవుతుందని మేమంతా విశ్వసించాం.

కాని తీరా అక్కడికి వెళ్ళేసరికి మాకు కనబడ్డ దృశ్యం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కూర్చోడానికి కుర్చీలూ, బెంచీలూ లేని మాట వాస్తవమే అయినా, అలంకరణాది విధానంలోనూ, ఇతరత్రానూ ఆ పెండాలంతా అతి నూతనంగా కనిపించి వింతసోయగాన్ని వెదజల్లింది. కూర్చోవడం అన్నది నేలమీదనే అయినా, కూర్చోడానికిగాను నేలమీద విలువయిన ఖద్దరు తివాసీలు పరచబడ్డాయి. ఏ విధంగా పరిశీలించినా గత సంవత్సారలకంటె ఖర్చులు తగ్గాయని తలంచడానికి తావేలేదు. గాంధీగారు నిరాడంబరంగా కాంగ్రెసు సమావేశం జరిపించాలనే కోరిక వ్యక్తపరచి ఉండవచ్చు. కాని నిర్వాహకులు మాత్రం, ఏనాడూ ఏ కాంగ్రెసులోనూ జరగని విధంగా, అతి ఆడంబరంగా అలంకరణాదులు జరిపించి ఆ పెండాలును చూడ ముచ్చటగా రూపొందింపజేశారు. ఈ యేర్పాట్ల కన్నింటికీ సుమారు రెండు లక్షల రూపాయలకు పైగానే

  1. 27 - 12 - 1921