నేను కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఉంటూవున్న రోజులలోనే బార్డోలీ (గుజరాతు) లో పన్నుల నిరాకరణ ఉద్యమం నడిపించాలనే ప్రతిపాదన కార్యనిర్వాహకవర్గ సభలో ప్రవేశపెట్టబడింది. మాలో బార్డోలీ ప్రాంతాన్ని చూడనివారి కందరికీ - అక్కడి పరిస్థితులు అవగాహన కాకపోవడాన్నీ - మాలో శక్తి సంపన్నుడూ బలాధ్యుడూ అనుకున్న వ్యక్తి సహితం పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని నిర్వహించుకు రాగలదా అనే సంశయం ఉత్పన్నమైంది. నిజంగా బార్డోలీ ప్రజలు కష్టనష్టాలకు తట్టుకోగలరా అనే అనుమానం మమ్మల్ని బాధించింది. దాన్తో ఆకార్య నిర్వహకవర్గం సభలో మహాత్మగాంధీగారిని యీ పన్నుల నిరాకరణ ఉద్యమం అంటె వారికి వున్నభావమూ, అభిప్రాయమూ యేమిటనీ, బార్డోలీ ప్రాంతీయులచేత యీ పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభింపజేసి జయాన్ని చవిచూడగలరా అని ప్రశ్నించాము. అప్పుడు లాలా లజపతిరాయి గారూ కార్య నిర్వాహక సంఘ సభ్యులే. వారికీ ఈ బార్డోలీ సత్యాగ్రహ విషయంలో జయం సాధించగలం అనే నమ్మిక కుదరలేదు. ఆయన కూడా గాంధీగారిని, బార్డోవల్ ఉద్యమాన్ని ఈ విధంగా సాగించి ప్రభుత్వ విధానాన్ని మట్టుపెట్ట గలరని ప్రశ్నించారు.
అప్పట్లో గాంధీగారి హృదయంలో కూడా యీ విషయంలో ఒక నిర్నీతమయిన అభిప్రాయం ఉన్నట్లు లేదు. లజపతిరాయిగారు, సమగ్రమయిన తమ విధానాన్ని తేటతెల్లం చెయ్యమని గాంధీగారిని అడిగినప్పుడు, గాంధీగారూ కొంచెం నీళ్ళు నములుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయన యేమన్నారో తెలుసా? దానికేముంది, మెజస్ట్రీటుగారికంటె ముందుగానే వెళ్ళి వారి కుర్చీలో కూర్చుని ఆకేసులన్నీ పరిష్కారం చేస్తానన్నారు. ఆ ముక్కలు నాకుగాని, లజపతిరాయిగారికిగాని ఎంతమాత్రమూ రుచింపలేదు.
ఇది చాలా స్వల్ప విషయమే అయినా, ఈ సంభాషణ జరిగి అప్పుడే పాతిక సంవత్సరాలు దాటినా, నాకు మాత్రం యీ సన్నివేశం అంతా బాగా జ్ఞప్తిలో ఉండిపోయింది. అప్పట్లో గాంధీగారికి ఆంగ్లరాజ్యాంగ విధానాన్ని కూలద్రోయడానికి సరియయిన పథకం అంటూ