పుట:Naajeevitayatrat021599mbp.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీరుచూస్తే 1921 వ సంవత్సరంలో సాధించిన ఫలితాలు ఒక్క అయిదారు సంవత్సరాలపాటు నిలబెట్టుకో గలిగిననాడు, క్రిందనుంచి పైదాకా అన్నివిధాలా ఆంగ్ల రాజ్యాంగ యంత్రాన్ని త్రోసిపుచ్చి, ఫిర్కా గ్రామీణ ప్రాంతాలలోనే గాక, తాలూకాలలోనూ జిల్లాలలోనూ కూడా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాధికారుల సలహా సంప్రతింపులతో గాని, ఆర్ధికాది సహకారాలతోగాని నిమిత్తం లేకుండా, మనమే పరిపాలించుకో గలము అనే ధైర్యమూ, దృడవిశ్వాసమూ కాంగ్రెసువారిలో కుదిరాయి.

ఆంధ్ర, కన్నడ, ద్రవిడ, మహారాష్ట్ర, మలయాళాది దక్షిణ ప్రాంతాలూ, అంగ, వంగ, కళింగ, కాశ్మీర, అంటూ ఏకరువుపెట్టె రీతిగా, పంజాబు, సంయుక్త రాష్ట్రాలు, మధ్యరాష్ట్రాలు, గుజరాతు, బెంగాలు, ఉత్కళాది ప్రాంతాలన్నీ, ఒక్క బిగిని కాంగ్రెసు వారి నిర్మాణకార్యక్రమానికి అన్ని విధాలా దోహదాన్నిచ్చి, పోటా పోటీల మీద, మా రాష్ట్రంలో అంటే, మా రాష్ట్రంలో అంటూ, ముందు కురికాయి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇదే వరస.

అహమ్మదాబాదులో కాంగ్రెసు జరిగే నాటికి యీ నిర్మాణాత్మక కార్యక్రమం అన్నది అన్నివిధాలా, జయాన్నే సాధించింది. వేలూ, లక్షలూగా ఉన్న నిరక్షరాస్యులు కూడా ఉత్తేజపూరితులయి, నూత్న శక్తితోనూ, తేజస్సుతోనూ విరాజిల్లుతూ స్వరాజ్య సంపాదనకోసం ఎట్టి ఉత్కృష్టమయిన త్యాగాలకయినా సరే సర్వసన్నద్దు లయ్యారు. నిర్ణీతమయిన కాలంలో కాంగ్రెసు విధానానికి తలయొగ్గి నిర్మాణాత్మక కార్యక్రమం దేశం మొత్తంమీద చాల ఉద్దృతంగా నెలకొల్పబడిన పరిస్థితిని గమనిస్తే, సాలాఖరునాటికి వ్యష్టి సత్యాగ్రహానికే గాదు, సమిష్టి సత్యాగ్రహాని కయినా దేశం సర్వసన్నద్ధంగా ఉన్నదని రుజువయింది.

పన్నుల నిరాకరణ విషయమై సంశయాలు

కాని నాకు మాత్రం పన్నుల నిరాకరణ ఉద్యమానికి దేశం యింకా సిద్ధంగా లేదేమోననే ధర్మసందేహం పీకుతూనే ఉంది. గాంధీ గారికి కూడా, వీలయితే యీ పన్నుల నిరాకరణ అన్నది ఒక్క బార్డోలీ ప్రాంతానికే పరిమితం జేయాలనే అభిప్రాయం స్థిరంగా యేర్పడింది.