పుట:Naajeevitayatrat021599mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రిక మరొక్కటి ఏదీ కూడా ఉండేది కాదు. గాంధీగారి ఉద్యమానికి అప్పుడు వారపత్రికలు తప్ప దినపత్రికలు ఏవీ లేవు. అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళినప్పుడు ఒకరోజున నేనూ, గాంధీగారూ కారులో కూర్చుని వెడుతూ ఉన్నప్పుడు ఆయన దేవదాసు గాంధీకి వివాహము చేయదలచి ఉన్నాననీ, కొన్ని కారణాలచేత ఆ వివాహం జరగలేదనీ చెప్పారు. ఇంకా మాకు, ఆయన గృహ సంబంధమైన విషయాలు కూడా నాతో చర్చించేటంత అన్యోన్యభావం కలిగింది. ఆ దేవదాసు గాంధీకి అప్పటినించీ వివాహము కాకపోవడమూ, తరవాత రాజగోపాలాచారిగారి కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చెయ్యడమూ జరిగాయి. దేవదాసుగాంధీకీ, రాజగోపాలాచారిగారి కుమార్తెకీ వివాహం జరిగిన కాలంలో రాజగోపాలాచారిగారూ, నేనూ ఒకరొకరికి కొంచెం దూరం అయ్యాము.

21, 22 సంవత్సరాల్లో మేమిద్దరమూ ఐకమత్యంగా ఉండి నిర్మాణ కార్యక్రమం మంచి ఉత్సాహంతో నడిపిస్తూ ఉండేవాళ్ళము. 23 వ సంవత్సరము ఫిబ్రవరి, మార్చినెలల్లో అభిప్రాయభేదాలు ఏర్పడి మేము విడిపోవడం తటస్థించింది. 21 వ సంవత్సరంలో కాంగ్రెసు విథానం పూర్తిగా నిర్వర్తించడానికి కంకణం కట్టుకుని బయలుదేరిన పత్రిక 'స్వరాజ్య' ఒక్కటే అని పైన వ్రాశాను. 'స్వరాజ్య' అహమ్మదాబాదు కాంగ్రెసులో చేసిన తీర్మానాల ప్రకారం కాంగ్రెసువారినీ, ప్రజలనీ బ్రహ్మాండంగా ఉద్బోధించింది. అ తరవాత కూడా అల్లాగే