పుట:Naajeevitayatrat021599mbp.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశంలో ఉన్న ప్రజలూ, నాయకులూ అదివరకు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమం ఎరుగరు. ఇంతపెద్ద కార్యక్రమం కాంగ్రెసు ఆశయాల ప్రకారం నడిపించడానికీ, ఆశయాల ప్రకారం పనిచెయ్యడానికీ, ప్రజలచేతకూడా పనిచేయించడానికి పూనుకున్న నాకూ, పత్రికకీ దేశంలో అంతటా మహత్తరమైన బలమూ, సాహాయ్యమూ లభించాయి. పత్రిక ప్రచురణ అయిన మొదటి మాసంలోనే ఐదువేల ప్రతులు అమ్ముడుపోయాయి. రెండోమాసంలో - అంటే మేము అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళడానికి ముందు - ఎనిమిదివేల పై చిల్లర అమ్ముడు పోయాయి.

అహమ్మదాబాదు వెళ్ళినప్పుడు రాజగోపాలాచారిగారు గాంధీగారికి నన్ను గురించి తెలియజేస్తూ, స్వరాజ్య పత్రిక స్థాపించడానికి ఆలోచించడమూ, స్థాపించడమూ, రెండు మాసాలలోగానే 8, 9 వేల ప్రతులు అమ్మడమూ కూడా చెప్పారు. గాంధీగారికి ఆ విషయం చాలా సంతోషం కలిగించింది. అదివరకు గాంధీగారికీ, నాకూ ప్రత్యేకంగా స్నేహం లేకపోయినా ఈ పత్రిక మూలంగా వారికి ఎక్కువ దగ్గిర స్నేహితుల్లో ఒకణ్ణి అయ్యాను.

అహమ్మదాబాదు కాంగ్రెస్సు సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమం మొట్టమొదట తీర్మానించిన కాంగ్రెస్సు, భారతదేశం మొత్తంమీద సహాయ నిరాకరణోద్యం నడిపించడంలోను, కాంగ్రెసు ఆశయాలు ప్రబోధించడంలోనూ ఇంత దృఢంగా కంకణం కట్టుకున్న