పుట:Naajeevitayatrat021599mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రూపాయలు బదులు పుచ్చుకుని, ముద్రణాలయ స్థాపనకి కావలిసిన సామగ్రి అంతా సమకూర్చుకున్నాము. ఆ సమయంలోనే కాశీనాథుని నాగేశ్వరరావుగారు ఇంగ్లండునించి 25 వేల రూపాయలుపెట్టి ఒక ముద్రాయంత్రం తెప్పించారు. అది ఇంకా ఓడలో ఉండగానే నాగేశ్వరరావుగారిని కలుసుకుని అ 25 వేల రూపాయల రొక్కమూ మా దగ్గిర పుచ్చుకుని ఆ మిషను మాకు ఇవ్వవలిసిందని కోరాము. మాకు మొదటినించీ నాగేశ్వరరావుపంతులుగారు కూడా ముఖ్యమైన ప్రోత్సాహకులుగా ఉండడంచేత, వెంటనే ఆ మిషను మాకు అప్పజెప్పి త్వరలో పత్రిక ప్రారంభించడానికి కారణభూతులు అయ్యారు.

నేను 1921 వ సంవత్సరం ప్రారంభంలో న్యాయవాదవృత్తి వదలివేశాను. వెంటనే స్నేహితులూ, నేను ఈ పత్రిక స్థాపించడానికి పూనుకున్నాము. డబ్బు వసూలు చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాము. అడిగినవారు అందరూ 'లేదు' అనకుండా వారివారికి తోచిన ప్రకారంగా వాటాలు కొని, మూలధనం సేకరించడానికి సహాయపడ్డారు.

ఆ సంవత్సరంలోనే డిసెంబరునెలలో అహమ్మదుబాదు కాంగ్రెసు జరుగబోతూ ఉంది. నాగపూరు కాంగ్రెసు తీర్మానం ప్రకారం 12 మాసాలలో తిలకు స్వరాజ్యనిధికి కోటి రూపాయలు, 20 లక్షల రాట్టాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత శాసనోల్లంఘనాన్ని గురించిన కార్యక్రమం ఏర్పరచ డానికి అహమ్మదాబాదు కాంగ్రెసు సమావేశం కాబోతూ ఉంది. నేను కాంగ్రెసు సమావేశం అయ్యేలోపుగా స్వరాజ్య పత్రిక స్థాపించి అహమ్మదాబాదు కాంగ్రెసుకి వెళ్ళాలని శపథం పట్టాను. ఆ దీక్షప్రకారం ముద్రణాలయం స్థాపించి, పత్రిక అక్టోబరు 26 వ తేదీని ప్రచురించాను.